ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా భావిస్తున్న ముప్పిడి అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, విదేశాల నుండి తప్పించుకు తిరుగుతున్న ఆయన వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైనదిగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ స్కామ్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణ నుంచి, తెరవెనుక చక్రం తిప్పడం వరకు అవినాష్ రెడ్డి ప్రధాన భూమిక పోషించారని నిర్దారించారు. అయితే ఆయన కేసు బయటపడగానే తప్పించుకునిపోయారు.
రాజ్ కేసిరెడ్డితో పాటు చక్రం తిప్పిన ముప్పిడి అవినాష్ రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీల రూపకల్పనలోనూ, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలను మార్చడంలోనూ ముప్పిడి అవినాష్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ భారీ నెట్వర్క్లో అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల నిధుల మళ్లింపునకు బాధ్యుడిగా ఆయనను అధికారులు గుర్తించారు. చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్న అవినాష్ రెడ్డి, చట్టం నుండి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ ఇప్పుడు ఆయనే వచ్చి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అవినాష్ రెడ్డి వస్తే మరిన్ని సంచలనాలు
సహ నిందితుడు రాజ్ కెసిరెడ్డికి బెయిల్ రావాలంటే అవినాష్ రెడ్డి లొంగిపోవడమే మార్గమని స్పష్టం కావడంతో, ఆయనను తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారత్కు తిరిగి వచ్చినా తనను అరెస్టు చేయకూడదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరారీలో ఉన్న వ్యక్తికి ముందస్తు రక్షణ కల్పించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో, ఇప్పుడు ఆయనకు లొంగిపోవడం మినహా మరో దారి లేకుండా పోయింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి రాక కోసం అటు పోలీసులు, ఇటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చి విచారణను ఎదుర్కొంటే, లిక్కర్ స్కామ్లో దాగి ఉన్న అసలు నిజాలు, నిధుల మళ్లింపు ఎక్కడికి జరిగింది ,ఇందులో ఎవరెవరి వాటాలు ఉన్నాయనే అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అన్నీ లెక్కలు ఆయన చేతుల మీదుగానే !
మద్యం తయారీదారుల నుండి సిండికేట్ల వరకు సాగిన అక్రమ వసూళ్లలో అవినాష్ రెడ్డి పిల్లర్ గా పనిచేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఆయన పట్టుబడితే ఈ స్కామ్లో ఉన్న మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికీ దొరక్కుండా ఇన్నాళ్లూ తప్పించుకున్నా, చివరకు న్యాయస్థానం కఠిన వైఖరితో ఆయన అరెస్టు అనివార్యంగా మారింది.
