భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల రంగంలో సరికొత్త చరిత్ర నమోదుఅయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా , గిన్నిస్ వరల్డ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. పుట్టపర్తి సమీపంలో నిర్మిస్తున్న బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ లో NHAI ఏకంగా 156 లేన్-కిలోమీటర్ల మేర నిరంతరాయంగా బిటుమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న 84.4 లేన్-కిలోమీటర్ల రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. ఈ భారీ నిర్మాణంలో సుమారు 57,500 మెట్రిక్ టన్నుల తారు మిశ్రమాన్ని వినియోగించి, అత్యధిక పరిమాణంలో కాంక్రీట్ వేసిన మరో ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.
వాస్తవానికి ఈ రికార్డుల పర్వం జనవరి 6 నుంచే ప్రారంభమైంది. అదే కారిడార్‌లో కేవలం 24 గంటల వ్యవధిలో 28.8 లేన్-కిలోమీటర్ల రోడ్డును నిర్మించి, 10,655 మెట్రిక్ టన్నుల తారును ఉపయోగించినందుకు అప్పుడే రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. తాజా విజయంతో కలిపి, ఒకే వారంలో మొత్తం నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి NHAI ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. అత్యాధునిక యంత్రాలు, పకడ్బందీ లాజిస్టిక్స్ , ఐఐటీ బాంబే వంటి సంస్థల పర్యవేక్షణలో ఈ అద్భుతం సాధ్యమైంది.
బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ సుమారు 343 కిలోమీటర్ల పొడవైన 6-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ హైవే. ఇది పూర్తయితే బెంగళూరు నుండి విజయవాడకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. రాయలసీమ , కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను ఇది సమూలంగా మార్చేయడమే కాకుండా, పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేయనుంది. కేవలం పరుగులే కాదు, నాణ్యతలోనూ రాజీ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారిని తీర్చిదిద్దుతున్నారు.
గతంలో ఖతార్ వంటి దేశాల పేరిట ఉన్న రికార్డులను భారత్ వరుసగా బద్దలు కొడుతుండటం మన దేశ మౌలిక సదుపాయాల వేగానికి నిదర్శనం. రాత్రింబవళ్లు శ్రమించిన వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు , రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ వంటి కాంట్రాక్ట్ సంస్థల సమష్టి కృషి వల్లనే తెలుగు గడ్డపై ఈ ప్రపంచ రికార్డుల మోత మోగిందని నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.


