ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ, సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో కొత్తగా అమరావతి , తిరుపతి ఎకనమిక్ రీజియన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నవంబర్ 13న విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌ను ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన ఆర్థిక మండలాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాంతీయ మాస్టర్ ప్లాన్ల అమలు, మౌలిక సదుపాయాల కల్పన , పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ రీజియన్లు పనిచేయనున్నాయి.
అమరావతి ఎకనమిక్ రీజియన్ సుమారు 44,962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 9 జిల్లాల ( న్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం కలయికతో ఏర్పడనుంది. దీనికి సీఈవోగా పురపాలక పట్టణావృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ నియమితులయ్యారు. అదేవిధంగా, రాయలసీమ , నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ 9 జిల్లాలు తిరుపతి, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య తిరుపతి కలిపిఎకనమిక్ రీజియన్ ఏర్పాటైంది. దీనికి సీఈవోగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ ఎకనమిక్ రీజియన్ల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వృద్ధి, సంస్థాగత భాగస్వామ్యాలు , ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా, పరిపాలనాపరమైన సమన్వయాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌లోని లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మూడు రీజియన్లు విశాఖ, అమరావతి, తిరుపతి రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. పర్యవేక్షణ బాధ్యతలను సీఈవోలకు అప్పగించడంతో పాటు, పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.


