అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై ఓ స్పష్టత వచ్చింది. వెంకటేష్‌తో ఓ సినిమా చేస్తాడని తెలుసు కానీ, ఆ సినిమాలో ఉన్న మరో హీరో ఎవరన్న విషయంపై తర్జన భర్జనలు జరిగాయి. కార్తి, ఫహద్ ఫాజిల్ పేర్లు బాగా చక్కర్లు కొట్టాయి. ఆ తరవాత సాయి ధరమ్ తేజ్ పేరు కూడా బయటకు వచ్చింది. చివరాఖరికి కల్యాణ్ రామ్ ఖరారు అయ్యారు. వెంకీ – కల్యాణ్ రామ్ అన్నది ఎవరూ ఊహించని కాంబో. దాన్ని సెట్ చేయగలిగాడు అనిల్ రావిపూడి.
‘పటాస్’ తో అనిల్ రావిపూడికి లైఫ్ ఇచ్చాడు కల్యాణ్ రామ్. ఆ సినిమాతో అనిల్ జాతకం ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ‘పటాస్’ తరవాత మళ్లీ కల్యాణ్ రామ్ తో సినిమా ఎప్పుడు అంటూ అనిల్ రావిపూడిని నందమూరి ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. కల్యాణ్ రామ్ కూడా అనిల్ తో మళ్లీ పని చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందుకు అనువైన సమయం వచ్చినట్టైంది. రెండో హీరో కోసం అనిల్ రావిపూడి ఇండస్ట్రీ అంతా జల్లెడ పట్టారు. చివరికి కల్యాణ్ రామ్ ని ఫిక్స్ చేసుకొన్నారు. అలా కల్యాణ్ రామ్ కోరిక, అనిల్ రావిపూడి కోరిక.. ఈ సినిమాతో తీరిపోయాయి.
ఎఫ్ 2, ఎఫ్ 3లా ఇది కూడా తోడళ్లుళ్ల కథే అని సమాచారం. వారి వారి పెళ్లాలతో హీరోలు పడే పాట్ల చుట్టూ కథ నడుస్తుందని టాక్. ఫహద్ ఫాజల్ అనుకొన్నప్పుడు వెర్షన్ వేరేలా ఉండేదని తెలుస్తోంది. కల్యాణ్ రామ్ వచ్చాక.. కథలో చిన్న చిన్న మార్పులు చేశారని సమాచారం. అనిల్ రావిపూడి వరుస హిట్లలో ఉన్నాడు. కల్యాణ్ రామ్ కి ఇప్పుడు ఓ హిట్ కావాలి. కాబట్టి… ఈ సమయంలో ఇది అవసరమైన కాంబినేషనే అనిపిస్తోంది.


