ఎస్.ఎస్.రాజమౌళితో మరో దర్శకుడ్ని పోల్చలేం. అది తప్పు కూడా. ఆయన లెక్క వేరు. పట్టుకొన్న ప్రతీదీ హిట్టే. పైగా ఒకదాన్ని మించి మరో సినిమా. అసలు సినిమా అంటే ఎలా తీయాలి? దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? అనే విషయాన్ని రాజమౌళిని చూసే నేర్చుకోవాలంతా. ఒక్కటంటే ఒక్క ఫ్లాపు లేని కెరీర్ ఆయనది. ఆయనతో ఎవర్ని పోలుస్తాం? ఎలా పోలుస్తాం?
కానీ అనిల్ రావిపూడి కూడా తక్కువ వాడేం కాదు. రాజమౌళి జోన్.. రాజమౌళిది. రావిపూడి స్టైల్ రావిపూడిది. వరుసగా 9 విజయాలు. అది కూడా కామెడీని నమ్ముకొని. ఈ క్రెడిట్ మరెవ్వరికీ సాధ్యం కాదేమో? స్క్రిప్టుకి పెద్ద సమయం తీసుకోడు, షూటింగ్ ఫాస్ట్ గా చేస్తాడు, ఎంత పెద్ద హీరోనైనా తన కథకు అనుకూలంగా మలచుకొంటాడు. మరీ ముఖ్యంగా రాజమౌళిలానే ప్రేక్షకుల పల్స్ తనకు బాగా తెలుసు. ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతారు? దేనికి నవ్వుతారు? అనే విషయంలో ఆరి తేరిపోయాడు. వరల్డ్ బిల్డింగులు, హీరోయిజాలూ అంటూ తెలుగు చిత్రసీమ పరిభ్రమిస్తున్న వేళ, సింపుల్ కథలతో హిట్లు కొట్టేస్తున్నాడు. పైగా రాజమౌళిలానే ప్రమోషన్ స్ట్రాటజీ కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకొంటుంటాడు. రూపాయి ఖర్చు లేకుండా తాను చేసే ప్రమోషన్స్, స్ట్రాటజీ మెస్మరైజ్ చేస్తుంటాయి. ఎప్పుడూ ప్రమోషన్లకు రాని నయనతారనే రంగంలోకి దింపి ప్రమోట్ చేసుకొన్నాడంటే అనిల్ రావిపూడి తెలివి తేటల్ని అర్థం చేసుకోవొచ్చు.
అన్నింటికంటే ముఖ్యంగా నెగిటివిటీని చాలా తట్టుకొన్నాడు. రావిపూడి హిట్స్.. అంత తేలిగ్గా, త్వరగా జీర్ణం చేసుకోలేని ఓ వర్గం ఉంది. వాళ్లంతా రావిపూడిని ‘క్రింజ్ కామెడీ.. ఫ్లూక్ హిట్స్’ అని తేలిగ్గా తీసుకొంటుంటారు. కానీ అదే క్రింజ్కి కోట్లు గుమ్మరిస్తున్నారు జనం. ప్రేక్షకులేం వెర్రివాళ్లు కాదు. ఓ సినిమాని హిట్ చేశారంటే.. దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఒకసారి హిట్టయితే అది ఫ్లూక్.. అదే వరుసగా 9సార్లు హిట్లయితే.. ఏమనుకోవాలి? సోషల్ మీడియాలో రావిపూడికి నెగిటీవ్ గా ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకైతే లెక్కేలేదు. కానీ రావిపూడి ఇవేం పట్టించుకోడు. ఒక్కసారి కూడా అదుపు తప్పి మాట్లాడలేదు. ఇలాంటి విమర్శల్ని కూడా తన విజయాల్లో, తన పనిలో భాగం చేసుకొన్నాడు. తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో సినిమాలు తీసి, నిర్మాతలకు ఎక్కువ లాభాన్ని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించే దర్శకులే ఇప్పుడు టాలీవుడ్ కావాలి. ఇలాంటి దర్శకులు ఎంతమంది ఉంటే.. చిత్రసీమ అంత కళకళలాడుతుంది.


