సినిమాల సక్సెస్ రేట్ పడిపోయింది. ఏడాదికి ఓ మూడు ఘన విజయాలు రావడం గగనమైపొయిన రోజులివి. ఇలాంటి పరిస్థితిలో ఒక దర్శకుడు ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం అంటే అద్బుతమే. ఇలాంటి అద్భుతాన్ని చేసి చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయాలు లేని దర్శకుడి జాబితాలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరి లేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు.. ఇప్పటివరకూ అనిల్ తీసిన సినిమాలు. అన్నీ సూపర్ హిట్ సినిమాలే. అయితే ప్రతి విజయం వెనుక ఒక కథ వుంది. అనిల్ ప్రతి సినిమా డివైడ్ టాక్ తోనే మొదలౌతుంది. ముఖ్యంగా ఒక వర్గం విమర్శకులకు ఆయన సినిమాలు నచ్చవు. లాజిక్ లెస్, బఫూన్, క్రింజ్.. ఇలానే ప్రతి సినిమాకి విమర్శలు ఎదురుకుంటాడు అనిల్. కాకపోతే ప్రేక్షకులు ఆయన సినిమాకి బ్రహ్మరధం పడతారు. హాయిగా నవ్వుకోవడానికి థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ కి సరైన ట్రీట్ ఇస్తాడు అనిల్. అదే ఆయన సక్సెస్ సీక్రెట్.
ట్రిపుల్ హ్యాట్రిక్ అంటే మాటలు కాదు. తొలి విజయం ఏదో గాలివాటంగా వచ్చిందని అన్నారు. మరో మూడు విజయాలు అందుకున్నప్పుడు అదృష్టం అన్నారు. ఇలా చూస్తుండగానే ఒక సినిమాకి మించి ఒకటి విజయాన్ని అందుకుని ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఎవ్వరెన్ని రకాలుగా అనుకున్నా ఒకటి ఖచ్చితంగా అంగీకరీంచాలి. తెలుగు ప్రేక్షకుల నాడీ పట్టేశాడు అనిల్. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని ఎలా అలరించాలో అనే పట్టు, కిటుకు తనకి దొరికింది. ఈ పట్టు ఉన్నంతకాలం తనకి తిరుగులేదు.
