ఈమధ్య తమిళ హీరోలు తెలుగు దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ధనుష్ ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు చేశాడు. కార్తి ‘ఊపిరి’ సినిమాతో అలరించాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. సూర్య ఆల్రెడీ ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇప్పుడు మరో తెలుగు సినిమా పై సంతకాలు చేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘గీత గోవిందం’తో పెద్ద హీరోల దృష్టిలో పడిన దర్శకుడు పరశురామ్. ఆ తరవాత మహేష్ బాబు తో `సర్కారు వారి పాట` రూపొందించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా బాగానే ఆడింది. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ నిరుత్సాహపరిచింది. అప్పటి నుంచీ పరశురామ్ కొత్త సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. కార్తీ కోసం ఓ కథ రాసుకొని, కొంతకాలం ప్రయత్నాలు చేశాడు. కానీ కుదర్లేదు. ఇప్పుడు అన్నయ్య సూర్య దగ్గరకు వెళ్లాడని సమాచారం. సూర్య – పరశురామ్ మధ్య కథా చర్చలు నడిచాయని, ఈ సినిమా చేయడానికి సూర్య కూడా ఉత్సాహం చూపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుంది. వెంకీ అట్లూరి సినిమా ఇటీవలే మొదలైంది. పూర్తవ్వడానికి సమయం పడుతుంది. ఆ తరవాత ఓ తమిళ సినిమా కమిట్ అయ్యాడు. అది పూర్తయ్యాకే పరశురామ్ ప్రాజెక్ట్ ఉండాలి. కాకపోతే పరశురామ్ సూర్యని తొందర పెడుతున్నాడని తెలుస్తోంది. వెంకీ సినిమా పూర్తయిన వెంటనే తన సినిమా మొదలెట్టాలని చూస్తున్నాడు. కానీ సూర్య కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి పరశురామ్ సినిమా చేస్తాడా, లేదా? అనేది చూడాలి.
