“చట్టాలను చేసేవాళ్లే అందులో లోపాలను కావాలని మరీ పెట్టుకుంటారు. ఎందుకంటే తాము దుర్వినియోగం చేయడానికి. దాని వల్ల ఆ చట్టం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది”
ప్రస్తుతం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్న వైనం చూస్తే ఇక అసలు ఆ చట్టం ఎందుకు తెచ్చారు? అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి అని చట్టాన్ని తీసుకు వచ్చినట్లుగా హడావుడి చేశారు కానీ అధికారంలో ఉన్న వారు మాత్రమే ఫిరాయింపులకు పాల్పడేలా చేసే ఆయుధాలను ఇచ్చిన చట్టం అది. దానికి తాజా సాక్ష్యం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పులే. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ప్రపంచం అందరికీ తెలుసు. కానీ చట్టం ప్రకారం వారు పార్టీ మారలేదు కాబట్టి అనర్హతా వేటు వేయలేదు. ఇక్కడ స్పీకర్ తప్పుడు నిర్ణయం ఏమీ తీసుకోలేదు. చట్టం ప్రకారమే తీసుకున్నారు. అంటే లోపం అంతా చట్టంలోనే ఉంది.
చట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్ – తప్పుడు ఆలోచనలే శాపం
1960 , 70వ దశకాల్లో భారత రాజకీయాల్లో ఫిరాయింపులు పరాకాష్టకు చేరాయి. 1967లో హర్యానాకు చెందిన గయా లాల్ అనే ఎమ్మెల్యే ఒకే రోజులో మూడుసార్లు పార్టీ మారి సంచలనం సృష్టించారు. అప్పటి నుండి రాజకీయాల్లో పార్టీలు మారే వారిని ‘ఆయా రామ్.. గయా రామ్’ అని పిలవడం ప్రారంభించారు. 1967 నుండి 1971 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 142 సార్లు ప్రభుత్వాలు కుప్పకూలడానికి ఈ ఫిరాయింపులే కారణమయ్యాయి. ఈ అస్థిరతను అరికట్టడానికి 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. చట్టం ప్రకారం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక ప్రజాప్రతినిధి ఎంపీ లేదా ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యే సందర్భాలను చట్టంలో పేర్కొన్నారు. ఎన్నికైన పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా సభ్యుడు రాజీనామా చేసినప్పుడు అనర్హతకు గురవుతాడు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనికి ఉదాహరణ. సభలో పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు లేదా ఓటింగ్‌కు గైర్హాజరైనప్పుడు కూడా అనర్హతా వేయవచ్చు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు, నామినేటెడ్ సభ్యుడు ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత ఏదైనా పార్టీలో చేరినప్పుడు అనర్హతా వేటు వేయవచ్చు. ఇక్కడి వరకూ చట్టం అద్భుతంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టం చేసింది మంచి ఆలోచనతో కాదు దుర్బుద్దితో. తాము మాత్రమే ఈ చట్టం ద్వారా లాభం పొందాలని అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రమే లాభం కలిగేలా మార్పులు చేశారు. అంటే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని చేర్చారు. అంటే ఎవరైనా అనర్హతా వేటు వేస్తే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఈ ఒక్క కారణంతో అధికార పార్టీలు మాత్రమే అప్పటి నుంచి ఫిరాయింపులకు పాల్పడుతున్నాయి. విపక్షాలు బాధితులుగా ఉంటున్నాయి.
విలీనం షరతుతో సామూహిక ఫిరాయింపులకు అస్త్రం
ఈ చట్టంలో మరో అతి పెద్ద లోపం ఏమిటంటే ‘విలీనం’ అనే మినహాయింపు. ప్రస్తుత చట్టం ప్రకారం, ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీలో చేరితే దానిని విలీనంగా పరిగణిస్తారు. ఫిరాయింపులుగా చూడరు. అప్పుడు వారిపై అనర్హత వేటు పడదు. అంటే వ్యక్తిగత ఫిరాయింపులను కాకుండాఏకంగా సామూహిక ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చేసినట్లయింది. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీలను రెండు సార్లు విలీనం చేసుకున్నారు. టీడీపీ ఎల్పీని విలీనం చేసుకున్నారు. గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర పరిణామాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. విలీనాల ద్వారా సామూహిక ఫిరాయింపులతో ప్రభుత్వాలు మారిపోయాయి. అయితే చట్టం చేసిన పార్టీ కాంగ్రెస్సే ఎక్కువ బాధితురాలిగా నిలుస్తూండటం ఇక్కడ కొసమెరుపు. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే తుది అధికారం స్పీకర్‌కే ఉంటుంది. స్పీకర్ గా ఎన్నికైన వారికి పార్టీ ఉండకూడదు. కానీ నేటి రాజకీయాల్లో అలాంటి విలువలకు అవకాశం లేదు. ఫిరాయింపుల పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో సంవత్సరాల తరబడి జాప్యం చేయడం వల్ల, ఫిరాయింపుదారులు తమ పదవీకాలాన్ని విజయవంతంగా ముగించేస్తున్నారు. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లలో జరిగిన ఫిరాయింపులపై స్పీకర్లు త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానాలు సైతం తప్పుబట్టాయి. కానీ రాజకీయ నేతలు మాత్రం పట్టించుకోవడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు భారీగా అధికార పార్టీల్లోకి చేరారు. వారిపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ల జాప్యం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది. ఒకరు మాత్రమే విలువలు పాటిస్తే అది చేతకానితనం అనుకుంటారు. అందుకే వారు చేశారని వీళ్లు.. వీళ్లు చేశారని వాళ్లూ అంతకంతకూ చట్టాన్ని దుర్వినియోగం చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో శివసేనలో చీలిక వచ్చి ఏకనాథ్ షిండే వర్గం మెజారిటీ సభ్యులతో బీజేపీతో చేతులు కలపడం ఈ చట్టం ఎంత బలహీనంగా ఉందో నిరూపించింది. ఏ వర్గం అసలైన పార్టీ అనే వివాదం నెలల తరబడి కొనసాగింది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఇక్కడ రాజీనామా అనే అస్త్రాన్ని ఉపయోగించి చట్టం నుండి తప్పించుకున్నారు.
చట్టాన్ని చెరబట్టడం అనేది సాధారణ రాజకీయ ప్రక్రియగా మారిపోయిన శాపం
భారత రాజ్యాంగం శానస వ్యవస్థకు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చింది. శాసనసభకు సంబంధించినంతవరకూ స్పీకరే ఫైనల్. ఆయన నిర్ణయాలను కోర్టులు కూడా సవాల్ చేయవు. కానీ చట్టాన్ని ఇలా చెరబడుతున్న తీరు చూసి చాలా సార్లు న్యాయస్థానాలు స్పందించాయి. 1992లో సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని రూలింగ్ ఇచ్చింది. అయినప్పటికీ, స్పీకర్ నిర్ణయం తీసుకోనంత వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవనే నిబంధనను రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. 2020లో మణిపూర్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ గరిష్టంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతానికి ఆ తీర్పు ఆధారంగానే తెలంగాణలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది. లేకపోతే అసెంబ్లీ చివరి రోజున ఆ పిటిషన్లను తిరస్కరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సభాపతిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి చేసింది అదే. ఈ చట్టం కాగితం పులిగా మారింది. రాను రాను రాజకీయంగా వస్తున్న మార్పులతో నేతలు పార్టీ సిద్ధాంతాల కంటే అధికారమే పరమావధిగా చూస్తున్నారు. తప్పనిసరిగా వేటు వేయాల్సి వస్తే రాజీనామా చేస్తున్నారు. ప్రస్తుతం దానం నాగేందర్ వీలైనంత వరకూ అనర్హతా వేటు పడకుండా చూసుకుంటారు.స్పీకర్ వల్ల కూడా కాకపోతే అప్పుడ కూడా ఆయనపై అనర్హతా వేటు పడదు. రాజీనామా చేస్తారు. తమ సభ్యత్వానికి రాజీనామా చేసి, వెంటనే ఉప ఎన్నికల్లో అదే పార్టీ నుండి పోటీ చేసి మళ్లీ గెలుస్తున్నారు. దీనివల్ల చట్టం అమలు నీరుగారిపోతోంది. ఫిరాయింపుల వల్ల వచ్చే ఉప ఎన్నికల ఖర్చు అంతా సామాన్య ప్రజలపైనే పడుతోంది. ఓటర్లు ఒక పార్టీ గుర్తుపై అభ్యర్థిని గెలిపిస్తే, ఆ అభ్యర్థి తన వ్యక్తిగత లాభం కోసం పార్టీ మారడం ఓటరును వంచించడమే. కానీ ప్రజలకు శిక్షించే అధికారం మళ్లీ ఐదేళ్లకే వస్తోంది. వీళ్లను శిక్షించే చట్టం ఉపయోగపడటం లేదు.
చట్టాన్ని బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు సూచనలు
భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అమలులో ఉన్న లొసుగులను సరిదిద్దేందుకు సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా స్పందించింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న స్పీకర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు కాబట్టి కోర్టు కీలక సూచనలు చేసింది. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ఈ అధికారాన్ని స్పీకర్ నుండి తొలగించి, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఒక స్వతంత్ర శాశ్వత ట్రిబ్యునల్‌కు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు న్యాయ నిపుణులు , ఎన్నికల సంస్కర్తలు ప్రధానంగా స్పీకర్‌కు నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి పెట్టకపోవడం, అలాగే విలీనం నిబంధనపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 2/3వ వంతు సభ్యులు వేరే పార్టీలో చేరితే అది విలీనంగా పరిగణించే నిబంధన, సామూహిక ఫిరాయింపులకు కారణంగామరుతోంది. దీన్ని అరికట్టేందుకు, ఏ సభ్యుడైనా పార్టీ మారినట్లయితే, సంఖ్యతో సంబంధం లేకుండా వారి సభ్యత్వం తక్షణమే రద్దయ్యేలా చట్టాన్ని సవరించాలని నిపుణులు కోరుతున్నారు. అలాగే, ఫిరాయింపుకు పాల్పడిన ప్రజాప్రతినిధి ఆ సభ మిగిలిన కాలపరిమితి ముగిసే వరకు ఎటువంటి మంత్రి పదవిని లేదా లాభదాయక పదవులను చేపట్టకుండా కఠినమైన నిషేధం విధించాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకూ స్వేచ్చ ఉండాలని దినేష్ గోస్వామి కమిటీ లా కమిషన్ కొన్ని విభిన్నమైన మార్పులను సిఫారసు చేస్తున్నాయి. విప్ జారీ చేసే అధికారాన్ని పరిమితం చేయాలని అవిశ్వాస తీర్మానం లేదా బడ్జెట్ ఆమోదం సమయంలో మాత్రమే పార్టీ విప్ వర్తించాలని సూచిస్తున్నారు. మిగిలిన సాధారణ బిల్లుల సమయంలో సభ్యులు తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేసే స్వేచ్ఛ ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ప్రజాప్రతినిధులు పార్టీల చేతిలో బందీలుగా మారకుండా, సొంత నియోజకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే రాజకీయ పార్టీలు తమ ఎంపీలకు అంత స్వేచ్ఛ ఇచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించే అవకాశాలు ఉండవు.
రాజకీయ నేతలు నైతికత పెంచుకున్నా దేశానికి మేలు చేసినట్లే!
ఫిరాయింపుల నిరోధక చట్టం మౌలిక ఉద్దేశం నెరవేరాలంటే రాజకీయ జవాబుదారీతనం పెరగాలి. ఫిరాయింపుకు పాల్పడి రాజీనామా చేసిన అభ్యర్థి, అదే సభ కాలపరిమితిలో మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం ద్వారా రాజీనామా డ్రామాలను అరికట్టవచ్చు. స్పీకర్ కు కాలపరిమితి పెట్టి చట్టసవరణ చేయడం దాలా ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించడం ప్రధానం కాబట్టి, పార్టీలు మారే సంస్కృతిని కేవలం చట్టాలతోనే కాకుండా, రాజకీయ నైతికత ద్వారా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్రం ఒక సమగ్రమైన సవరణ బిల్లును తీసుకువస్తేనే ఈ రాజ్యాంగ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఏ చట్టమైనా దాని అంతర్లీన స్ఫూర్తితో అమలు అయినప్పుడే వ్యవస్థకు మేలు జరుగుతుంది. భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కేవలం రాజకీయ చదరంగంలో ఒక పావుగా మిగిలిపోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు వేయడం కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం. రాజకీయ నాయకుల్లో నైతికత పెరగనంత కాలం, చట్టంలోని లొసుగులను తొలగించనంత కాలం ఫిరాయింపుల నిరోధక చట్టం ఒక విఫల ప్రయోగంగానే చరిత్రలో మిగిలిపోతుంది.


