బంగ్లాదేశ్‌లో యువతను రెచ్చగొడుతూ సాగుతున్న ఉద్యమంలో నూరిపోస్తున్నది భారత వ్యతిరేకతనే. వారు కరెంట్ కొనకపోతే భారత్ డబ్బులు రావని.. భారత్ అంతా బంగ్లాపై ఆధారపడి ఉందని అక్కడి యువతను రెచ్చగొట్టేలా కొంతమంది చదువులేని ఉద్యమకారులు ప్రసంగాలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిని చూసి ఇండియాలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
హసీనాను అప్పగించలేదనే భారత్ పై కుట్రలు
బంగ్లాదేశ్ లో ఉద్యమం అంతా రాజకీయమే. షేక్ హసీనాను గద్దె దించడానికి కుట్ర చేశారు. షేక్ హసీనా భారత్ కు బంగ్లాదేశ్ ను మిత్రదేశంగా భావిస్తారు. బంగ్లాదేశ్ విముక్తికి భారత్ చేసిన యుద్ధమే కారణం. అందుకే భారత్ హసీనాకు ముప్పు వచ్చినప్పుడు భారత్ ఆశ్రయం కల్పించింది. కానీ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, ఆమెను అప్పగించాలనే డిమాండ్లకు భారత్ సుముఖంగా లేకపోవడంతో వారు భారత్ పై నిందలేస్తున్నారు.
షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య పై తప్పుడు ప్రచారాలు
ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య ఉదంతం బంగ్లాదేశ్‌లో కార్చిచ్చులా మారింది. ఈ దాడికి పాల్పడిన వారు భారత్‌కు పారిపోయారనే పుకార్లు, సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ప్రచారాలు యువతను రోడ్లపైకి తెచ్చాయి. భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని, బంగ్లాదేశ్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని యువతను కొంత మంది రెచ్చగొడుతున్నారు. షేక్ హసీనా పతనం తర్వాత ఏర్పడిన అధికార శూన్యతను పూరించడానికి జమాతే ఇస్లామీ వంటి ఇస్లామిక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ శక్తులు యువతలో ఉన్న జాతీయవాదాన్ని భారత్ వ్యతిరేకతతో ముడిపెడుతున్నాయి. భారత్ అనుకూల వ్యక్తి అంటే దేశ ద్రోహి అనే ముద్ర వేయడం ద్వారా యువతను తమ వైపు తిప్పుకుంటున్నారు. రాబోయే 2026 ఎన్నికల నాటికి తమ ఉనికిని చాటుకోవడానికి భారత్ వ్యతిరేకతను ఒక సులభమైన రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు.
దేశాన్ని నాశనం చేస్తున్న యూనస్
బంగ్లాదేశ్‌లో భారత్ ప్రభావం తగ్గితే తమకు లాభమని భావించే చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు అక్కడి సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని ( వ్యాప్తి చేస్తున్నాయి. సరిహద్దుల్లో కాల్పులు, తీస్తా నదీ జలాల వివాదం వంటి సున్నితమైన అంశాలను హైలైట్ చేస్తూ భారత్‌ను ఒక “విలన్”గా చిత్రించడం ద్వారా యువతలో ద్వేషాన్ని పెంచుతున్నారు. ఫలితంగా, ఇది కేవలం విద్యార్థుల ఉద్యమంగా కాకుండా, ఒక వ్యూహాత్మక రాజకీయ వ్యూహంగా మారుతోంది.