‘కిట్టూ ఉన్నాడు జాగ్రత’ అనే చిన్న సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టింది అను ఇమ్మాన్యుయేల్. ఆ సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా ఆమెకు అనూహ్యంగా అవకాశాలు వచ్చాయి. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగచైతన్య లాంటి స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
కాకపొతే ఆమె చేసిన దాదాపు సినిమాల ఫలితాలు తేడా కొట్టాయి. మధ్యలో చేసిన కొన్ని రొటీన్ సినిమాలు కూడా ఆమె క్రేజ్ ని తగ్గించాయి. తాజాగా వచ్చిన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. కథకి బలమైన పాత్రే ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది అను.
‘కెరీర్ ఆరంభంలోనే పెద్ద స్టార్స్‌తో కలిసి నటించాను. ఆ విషయంలో హ్యాపీగా వున్నా .. కొన్ని చేయకూడని సినిమాలు చేశాను. అది ముమ్మాటికీ నా తప్పే. కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదనుకున్నా’ అని చెప్పుకొచ్చింది.
కెరీర్ ఆరంభంలో దాదాపు అందరూ ఇలాంటి తప్పులు చేస్తారు. ఏ అవకాశం ఎలాంటి అదృష్టాన్ని తీసుకోస్తుందే అనే నమ్మకం అందరిలో వుంటుంది. కాకపొతే వాటిని అంగీకరించి ముందుకు సరిగ్గా సాగడం నిజమైన ఎదుగుదలకి గుర్తు. అను ఇమ్మాన్యుయేల్ కూడా ఇప్పుడు అదే దిశగా ఆలోచిస్తోంది. గత అనుభవాల నుంచి నేర్చుకొని, నటిగా గుర్తింపు తీసుకొచ్చే మంచి పాత్రల వైపు మళ్లాలని అను తీసుకున్న నిర్ణయం కెరీర్ కి పాజిటివ్ సైన్.


