అధ్యయనం చేస్తే త‌ప్ప వాస్త‌వాలు కనిపించవేమో..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భాజ‌పా నేత‌లకు వాస్త‌వాలు అవ‌స‌రం లేదేమో..! రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమైనా ఫ‌ర్వాలేదూ.. కేంద్రాన్ని వెన‌కేసుకుని రావ‌డంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్న‌ట్టుగా వారి ధోర‌ణి ఉంటోంది. గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని కేంద్రంపై టీడీపీ గ‌ళ‌మెత్తితే… భాజ‌పా చాలా చేసిందీ, చేయాల్సిన‌దానికి మించి చేసిందంటూ ఏపీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు ఓ వాద‌న‌ను అందుకున్నారు. ఇటీవల విశాఖ‌లో జ‌రిగిన భాగ‌స్వామ్య స‌ద‌స్సులోనూ అదే చెప్పారు. తాజాగా అమ‌రావ‌తిలో కూడా మ‌ళ్లీ అదే మాట‌ను వ‌ల్లెవేశారు.

స్వ‌తంత్రం వచ్చిన త‌రువాత‌, దేశంలో ఏ రాష్ట్రానికీ చేయనంత కేంద్ర సాయం ఆంధ్రాకి భాజ‌పా చేసింద‌ని కంభంపాటి హ‌రిబాబు అనేశారు. ఈ విష‌యంపై అనుమానం ఉంటే ఎవ‌రైనా అధ్య‌య‌నం చేసి వాస్త‌వాలు తెలుసుకోవ‌చ్చ‌న్నారు. మూడు రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా పొడిగించార‌ని కొంత‌మంది నేత‌లు చెబుతున్నార‌నీ, ఆ వివ‌రాలు త‌న‌కు ఇస్తే ఏపీకి హోదా కావాల‌ని తాను కూడా పోరాటం చేస్తాన‌ని అన్నారు. విభ‌జ‌న చట్టంలోని అంశాల అమలుతోపాటు, ఆంధ్రా అభివృద్ధి చెందాల‌న్న ఉద్దేశంతో ఇచ్చిన హామీల‌తోపాటు ఇవ్వ‌ని వాగ్దానాలు కూడా నెరవేర్చేశామ‌ని వివ‌రించారు. పోల‌వ‌రం నిర్మాణానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌నీ, ముంపు మండ‌లాల విష‌యంలో ఇప్ప‌టికే భాజపా చొర‌వ తీసుకుంద‌ని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన ఐదు అంశాలు మాత్ర‌మే పెండింగ్ లో ఉన్నాయ‌నీ, వాటిని కేంద్రం ప‌రిశీలిస్తోంద‌న్నారు. ఇదండీ.. హరిబాబు వరస.

వాస్త‌వ ప‌రిస్థితుల‌కు, హ‌రిబాబు వ్యాఖ్య‌ల‌కు మ‌ధ్య ఏదైనా పొంత‌న ఉందా చెప్పండీ..? దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన త‌రువాత దేశంలో ఏ రాష్ట్రానికీ కేంద్రం ఇంత సాయం చేయ‌లేద‌ట‌..! స‌రే… ఈ విష‌యంపై ఎవ‌రో అధ్య‌య‌నం చేయాల్సిన అవస‌ర‌మేముంది… అదేదో వారే చెయ్యొచ్చు క‌దా! ప్ర‌త్యేక హోదా కు బ‌దులు ఇస్తాన‌న్న ప్యాకేజీ కేటాయింపుల లెక్క‌లేవో తేలడం లేదు, వాటిపై అధ్య‌య‌నం చేయండి. విశాఖ‌కు ఇస్తామ‌న్న రైల్వే జోన్ ఏమైందో కనిపించడం లేదు, దాని మీద అధ్య‌య‌నం చేసి చెప్పండి! వెన‌క‌బ‌డిన జిల్లాల‌కు బుందేల్ ఖండ్ త‌ర‌హాలో ఇచ్చిన అద‌న‌పు నిధులేంటో అధ్య‌య‌నంలో తేల్చండి. రెవెన్యూ లోటు భ‌ర్తీ, విద్యా సంస్థ‌ల‌కు నిధులు, క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న పోల‌వ‌రం ప్రాజెక్టు కేటాయింపులు… ఇలా అన్నింటా ఏపీ విష‌యంలో భాజ‌పా చూపుతున్న అల‌స‌త్వం అధ్య‌య‌నం చేస్తే త‌ప్ప హరిబాబుకి అర్థం కాని అంశాలా చెప్పండీ..? ప్ర‌తీరోజూ ఇలాంటి హాస్యాస్పద‌మైన వ్యాఖ్య‌లు చేసే కంటే… మౌనంగా ఉంటే క‌నీస మ‌ర్యాదైనా ద‌క్కుతుంది. విచిత్రం ఏంటంటే… ఇప్ప‌టికైనా తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ది ఆంధ్రా నుంచే అనే వాస్త‌వం ఏపీ భాజ‌పా నేత‌లు గుర్తించపోవడం. అది కూడా అధ్యయనం చేస్తే తప్ప వారికి అర్థం కాదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.