ఏపీ భాజ‌పా నేత‌ల నిర‌స‌న దీక్ష‌లు ఎవ‌రి మీద‌..?

ఈ నెల 19 నుంచి 24 వ‌ర‌కూ రిలే నిరాహార దీక్ష‌లు చేసేందుకు సిద్ధ‌మౌతున్న‌ట్టుగా ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు. మీడియాతో మాట్లాడిన క‌న్నా… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌డు తీరుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త లేద‌నీ, కానీ ప్రాజెక్టు నిర్మాణం ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం కేంద్ర‌మే అంటూ త‌మ‌పై ముఖ్య‌మంత్రి విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. పోల‌వ‌రం నిధుల్లో దోచుకున్న‌వారికి ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేది లేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతోనే ప్ర‌తిప‌క్షాల‌ను చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్యంగా చేసుకుని బ‌లహీనప‌ర‌చే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శ‌ిస్తూ వ‌చ్చిన ముఖ్య‌మంత్రి, ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవ‌డం ఎంతవ‌ర‌కూ స‌బ‌బు అన్నారు.

ఈ విమ‌ర్శ‌ల‌న్నీ స‌రేగానీ… ఇంత‌కీ భాజ‌పా నేత‌లు దాదాపు వారం రోజులపాటు నిరాహార దీక్ష‌లు ఎందుకు చేస్తున్న‌ట్టు..? క‌న్నా చెబుతున్న కార‌ణం ఏంటంటే… రాజ‌ధాని అమ‌రావ‌తితోపాటు, కొన్ని పోర్టులు, ప్ర‌త్యేక ఎక‌నామిక్ జోన్ల కోసం అత్య‌ధికంగా భూముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింద‌ట‌! ఈ కేటాయింపుల‌కు నిర‌స‌న‌గానే దీక్షలు చేస్తున్న‌ట్టు క‌న్నా చెప్పారు. అంటే, భూముల‌ను ఇష్టా రాజ్యంగా ప్ర‌భుత్వం కేటాయించేసింద‌నే పాయింట్ మీద పోరాటం చేస్తున్నార‌న్న‌మాట‌. స‌రే, ఈ పోరాటం వ‌ల్ల ఏపీ భాజ‌పా నేతలు సాధించాల‌నుకుంటున్న‌ది ఏంటి..? అధికార పార్టీ మీద విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఏర్పాటు చేసుకున్న ప్రెస్ మీట్ కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌, దీని వెన‌క ఉన్న ప్ర‌యోజ‌నాలు వేరే ఏమైనా క‌నిపిస్తున్నాయా?

భాజ‌పా పోరాడాల్సిన అంశాలు రాష్ట్ర కేటాయింపుల‌పై మాత్ర‌మేనా..? ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల విష‌యంలో ఈ త‌ర‌హా నిర‌స‌న‌లు ఎందుకు వ్య‌క్తం చేయ‌డం లేదు..? స‌రే, సొంత పార్టీ మీద నిర‌స‌న వ‌ద్ద‌నుకుంటే… ఈ నేత‌లంతా ఢిల్లీకి వెళ్లి, ప్ర‌ధాన‌మంత్రిని ఓ విన‌తి ప‌త్రం లాంటివి ఇచ్చే ప్ర‌య‌త్నం ఎందుకు చెయ్య‌రు. ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌… ఇలా అప‌రిష్కృతంగా ఉన్న కేంద్ర హామీలు చాలా ఉన్నాయి. భాజ‌పా నేత‌లు ముందుగా స్పందించాల్సింది, వారి వైఖ‌రిని స్ప‌ష్టం చేయాల్సింది ఈ అంశాల‌పై క‌దా. రాష్ట్ర కేటాయింపుల్లో అవినీతి జ‌రిగిపోయిందే అనుకుంటే… కేంద్రంతో ఆదేశాలు ఇప్పించుకుని ఏదో ఒక ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ చేయించుకోవ‌చ్చు క‌దా! పోల‌వ‌రం దోచుకున్న‌వారిని వ‌దిలే ప్ర‌సక్తి లేద‌ని క‌న్నా చెప్ప‌డం మ‌రీ విడ్డూరం! ఆ ప‌నేదో భాజ‌పా త‌ల్చుకుంటే ఇప్పుడే చెయ్య‌గ‌ల‌దు, పైగా పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com