ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,32,205 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్, రాష్ట్ర అభివృద్ధి , ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లేలా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. పయ్యావుల కేశవ్ ఒకసారి ఓటాన్ అకౌంట్, రెండు సార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి హ్యాట్రిక్ సాధించారు. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లుగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లుగా అంచనా వేశారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతికి రూ. 6,000 కోట్లు, సాగునీటి రంగానికి రూ. 9,906 కోట్లు కేటాయించడం ద్వారా మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. తల్లికి వందనం పథకానికి రూ. 9,668 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం కోసం రూ. 6,600 కోట్లు కేటాయించారు. అలాగే పాఠశాల విద్యకు అత్యధికంగా రూ. 32,308 కోట్లుకేటాయించి విద్యారంగంపై తన నిబద్ధతను చాటుకుంది.
సంక్షేమ రంగంలో బీసీ ఉప ప్రణాళికకు రూ. 23,650 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,306 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 22,941 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ.. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు , ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు గా ఉండొచ్చని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన భారాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ విధానమని పయ్యావుల స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి కల్పన లక్ష్యంగా పరిశ్రమల శాఖకు రూ. 3,161 కోట్లు, రోడ్లు రవాణా మౌలిక సదుపాయాలకు రూ. 13,546 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం అభివృద్ధికి రూ. 28,000 కోట్లు ప్రతిపాదించడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
