తమిళనాడు రాజకీయాలు మరోసారి వ్యక్తిగత దూషణలతో వేడెక్కాయి. నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, విజయ్‌కు రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తూనే.. వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చారు. “విజయ్ ముందుగా తన ఇల్లు వదిలి బయటకు రావాలి.. ముఖ్యంగా నటి త్రిషతో ఉన్న బంధం నుండి బయటపడితేనే ఆయనకు క్షేత్రస్థాయి వాస్తవాలు అర్థమవుతాయి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేత, నటుడి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా నటులపై అనేక రూమర్స్ ఉంటాయి. వాటిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి పరువు తీసి.. మానసిక స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి ఆయన సిద్ధాంతాలపై విమర్శలు చేయడం మానేసి, ఇలాంటి వ్యక్తిగత దాడులకు దిగడం ప్రత్యర్థి పార్టీల బలహీనతను సూచిస్తోందని టీవీకే శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో కేవలం త్రస్థాయిలో తిరగాలి అని మాత్రమే విమర్శించిన నాగేంద్రన్, ఇప్పుడు నేరుగా త్రిష పేరును ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతుంటే, బీజేపీ మాత్రం అనవసరమైన రూమర్లను ప్రచారం చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూస్తోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సినిమా రంగంలో ఉండే రూమర్లను రాజకీయాల్లో ఆయుధాలుగా వాడుకోవడం తమిళ రాజకీయాల్లో కొత్త కాకపోయినప్పటికీ, ఇది ఒక తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, నైనార్ నాగేంద్రన్ చేసిన ఈ త్రిష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు, విజయ్ రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఎంత కఠినంగా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.
