వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జగన్ ప్రస్తుతం ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని, బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనలో ఎప్పుడో చచ్చిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ పూర్తిగా రాజీపడ్డారని షర్మిల విమర్శించారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదానగురించి అడిగే దమ్మున్న నాయకుడు రాష్ట్రంలో కరువయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తనపై ఉన్న కేసులు, స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ బీజేపీకి బినామీ గా వ్యవహరిస్తున్నారని, అందుకే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పేదలకు అన్యాయం చేస్తోందని షర్మిల మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కిన బీజేపీని ప్రశ్నించకుండా, జగన్ ఆ పార్టీకి మోకరిల్లడం రాష్ట్ర దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.
కూటమి నేతలు నేరుగా బీజేపీతో పొత్తులో ఉన్నాయి కాబట్టి షర్మిల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవు. కానీ జగన్ రెడ్డి మాత్రమే.. పొత్తులో లేకపోయినా..టీడీపీతో కలిసి ప్రభుత్వాల్లో ఉన్నా.. ఆయన బీజేపీని మాత్రం ప్రశ్నించలేకపోతున్నారు. ఇదే విషయాన్ని షర్మిల హైలెట్ చేస్తున్నారు. వైసీపీ వద్ద షర్మిల విమర్శలకు సమాధానం ఉండదు.
