పాలనలో విప్లవాత్మక మార్పులకు 12 బిల్లులు..!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనలో తనదైన మార్క్ చూపించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కొత్తగా పన్నెండు బిల్లులు తీసుకొస్తున్నారు. ఇందులో అత్యంత కీలకమైన… విధానపరమైన నిర్ణయాలతో పాటు.. సంక్షేమ పథకాలకు ఉద్దేశించినవి కూడా ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు వీలుగా కేబినెట్ సమావేశం పెట్టి… గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎస్సీ, ఎస్టీలు ఇక ఎవరైనా.. కరెంట్ రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ వాడుకుంటే బిల్లు చెల్లించాల్సిన పని ఉండదు. అలాగే అంగన్ వాడీ టీచర్ల జీతం రూ. వెయ్యి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు రూపొందించిన బిల్లును కూడా ఆమోదించారు. భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించే ముసాయిదా బిల్లుకు, భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టంలో మార్పులకు ఉద్దేసించిన ముసాయిదాకు ఆమోద ముద్రవేసింది. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక నుంచి మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వరు. ప్రభుత్వమే పార్ట్ టైమ్ ఉద్యోగుల్ని పెట్టుకుని నిర్వహిస్తుంది. దీని వల్ల దుకాణానికి ఐదుగురు చొప్పున యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రాజెక్టుల టెండర్ల విషయంలో… పారదర్శకత కోసం.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. జ్యూడిషియల్ కమిషన్ ఉండాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం దీని కోసం ఏకంగా చట్ట సవరణ చేయాలని అనుకుంది. జ్యుడీషియల్ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్టు 2001కి కూడా చట్ట సవరణ చేయాలనుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం భావించింది. దీనిపై.. కేబినెట్‌లో చర్చించారు కానీ నిర్ణయం తీసుకోలేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల నియామకాలకు ఆమోద ముద్రవేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com