విలన్‌గా ముగిసిన “దోశకింగ్” జీవితం..!

“దోశ కింగ్”గా ప్రపంచదేశాల్లో ప్రసిద్ధి పొందిన శరవణభవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్ మృతి చెందారు. తీవ్రమైన మనోవ్యాకులత… సమాజంలో గౌరవం పోయిందనే బాధ.. జైలుకు వెళ్లాల్సి వస్తోందనే మానసిక రుగ్మతతో… తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. ఏ కోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత జూలై 9న శిక్ష అనుభవించడానికి కోర్టులో లొంగిపోయారు. అక్కడ ఆయన మానసికంగా ఒత్తిడికి గురై అనారోగ్యం పాలయ్యారు. తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి.. తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి మార్చినా ప్రాణాలు నిలబడలేదు.

యువతకు స్ఫూర్తిగా వ్యాపార ప్రస్థానం..!

రాజగోపాల్‌ అతి నిరుపేద కుటుంబంలో జన్మించారు. 1979లో శరవణ భవన్‌ హోటల్ ను తొలి సారి ప్రారంభించారు. అంచెలంచెలుగా ఆ హోటల్.. ఎదిగింది. దేశవిదేశాల్లోనూ బ్రాంచీలు ప్రారంభించారు. దాంతో ఆయనను దోశ కింగ్‌గా పిలవడం ప్రారంభించారు. కానీ ఆయన చేసిన ఓ తప్పుతో.. ఎంతో స్ఫూర్తి దాయకంగా ఎదిగిన జీవితం ఒక్కసారిగా తలకిందలయింది. జ్యోతిష్యంపై పిచ్చి నమ్మకంతో.. మూడో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారు. తన దగ్గర పని చేసే వ్యక్తి కుమార్తెనే అందుకు ఎంచుకున్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే.. అతన్ని రాజగోపాల్ హత్య చేయించారు.

జాతకాల పిచ్చితో తన జాతకాన్నే తిరగేసుకున్న రాజగోపాల్..!

దీనిపై సుదీర్గ విచారణ తర్వాత 2004లో స్థానిక న్యాయస్థానం అతనితో పాటు హంతకులకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 2009లో మద్రాసు హైకోర్టు సైతం ఆ శిక్షనే ఖరారు చేసింది. దీనిని సవాల్‌చేస్తూ రాజగోపాల్‌ సుప్రీం కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది. నిజానికి అనారోగ్య కారణాల పేరుతో 2001 నుంచి బెయిల్‌పై ఉన్నారు. జీవితం మారుతుందని మూడో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ పెద్ద మనిషి… మొత్తానికే… జీవితాన్ని తిరగేసుకున్నాడు.

ఆయన ఎప్పటికీ విలనే..!

కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగినా.. స్వయంకృషిపై నమ్మకం లేక.. కేవలం జాతకం వల్లే ఎదిగానని.. నమ్మారు… శవరణభవన్ రాజగోపాల్. ఆ జాతకం కలసి వచ్చేలా చేసుకోవడానికి.. చేయకూడని తప్పు చేశారు. ఫలితంగా.. ఆయన జాతకం తిరగబడింది. కష్టపడి తెచ్చుకున్న పేరు, ప్రతిష్ట.. అన్నీ మసకబారిపోయాయి. చివరికి.. ఓ హంతకుడిగా.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు.. ఆయనను ఎవరూ.. జీవితంలో ఎదిగిన ఓ గొప్ప వ్యక్తిగా చూడరు. ఓ హంతకుడిగానే చూస్తారు. ఈ మనోవ్యధనే తట్టుకోలేక… ప్రాణాలు పోయేంతగా మథనపడ్డారు. చివరికి తనువు చాలించారు. యువతకు స్ఫూర్తిగా నిలవాల్సిన వ్యక్తి.. విలన్‌గా.. చివరిలో అందరి మనసుల్లో ముద్ర వేసి.. తనువు చాలించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com