కేంద్రంతో ఢీ అంటే ఢీ అనేందుకే కేసీఆర్ సిద్ధ‌మౌతున్న‌ట్టా..?

తెలంగాణ‌లో పార్టీని విస్త‌రింప‌జేయ‌డం కోసం భాజ‌పా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. భారీ ఎత్తున స‌భ్య‌త న‌మోదు చేస్తోంది, ఇంకోప‌క్క వ‌చ్చిన‌వారిని వ‌చ్చిన‌ట్టుగా పార్టీలో చేర్చుకుంటోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కీ సిద్ధ‌ప‌డుతోంది. భాజ‌పాలో ఇంత దూకుడు క‌నిపిస్తుంటే… దీనిపై నిమ్మ‌ళంగా స్పందిస్తున్నారు సీఎం కేసీఆర్. పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో భాజ‌పా కార్య‌క‌లాపాల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ… భాజ‌పా తెలంగాణ‌లో నిల్వ‌ది అన్నారు. పుల్వా, బాలోకోట్ దాడులను జ‌నాల‌కి చూపించి సెంటిమెంట్ రెచ్చ‌గొట్టి రెండోసారి గెలిచిన్రుగానీ, ప్ర‌జ‌ల‌కు చేసిన మంచి ప‌నులేం లేవ‌న్నారు. ఇక్క‌డ తెరాస చాలా బ‌లంగా ఉందనీ, భాజ‌పాగానీ వేరే ఏ పార్టీకీ ఇక్క‌డ స్థానం లేద‌న్నారు. గెలిచిన నాలుగు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మ‌క్కై సాధించుకున్నార‌నీ, వాటిని చూసి బ‌లం అనుకుంటే స‌రికాద‌న్నారు.

కేంద్రం నుంచి నిధులు రాకున్నా పెద్ద‌గా ఫిక‌ర్ లేద‌న్నారు. మిష‌న్ కాక‌తీయ‌, భ‌గీర‌థ‌ల‌కు నిధులు ఇవ్వాల‌ని నీతీ ఆయోగ్ చెప్పినా కేంద్రం ప‌ట్టించుకోలేద‌న్నారు. మీదికెల్లి రావు సాబ్ న‌హీ ఆయా అని ప్ర‌ధాన‌మంత్రి అంటుంటే ఏమ‌నాలె అని నీతీ ఆయోగ్ స‌మావేశానికి వెళ్ల‌క‌పోవ‌డంపై కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాక‌పోయినా రాష్ట్రంలో ఏ అభివృద్ధి ప‌నీ ఆగ‌ద‌ని నేత‌ల‌కు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

సీఎం కేసీఆర్ వైఖ‌రి చూస్తుంటే… కేంద్రంతో స‌యోధ్య‌కి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా లేదు. కేంద్రం నిధులు రాక‌పోయినా ఫ‌ర్వాలేదు అనే స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోప‌క్క‌, రాష్ట్రంలో భాజ‌పా బ‌ల‌ప‌డ‌టాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. స‌రే, రాష్ట్రంలో తెరాస‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీగా భాజ‌పా ఎదుగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నంత మాత్రాన‌… కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన‌వి రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా! కేసీఆర్ తీరు చూస్తుంటే అలా లేదు. నీతీ ఆయోగ్ స‌మావేశానికి వెళ్ల‌క‌పోవ‌డాన్ని కూడా స‌మ‌ర్థించుకుంటున్నారు. స‌మాఖ్య స్ఫూర్తి దృష్ట్యా చూసుకుంటే… కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఇలాంటి వాతావ‌రణం మంచిది కాదు. ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణి రెండు వైపుల నుంచీ ఉండాలి. భాజ‌పాకి అనుకూలంగా లేని రాష్ట్రాల‌పై కేంద్రం చిన్న చూపూ మంచిది కాదు, నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రంతో మ‌న‌కేంటి అవ‌స‌రం, సాయం లేకున్నా చ‌ల్తాహై అనే ర‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రించ‌డ‌మూ మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com