కొత్త గవర్నర్‌తో ఏపీలో ఆరెస్సెస్‌కి పునాదులు..!?

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ చాలా పెద్ద స్థాయిలో ఆశలు పెట్టుకుంది. అయితే.. ఆ పార్టీకి పునాది లాంటి ఆరెస్సెస్ కార్యకలాపాలు ఏపీలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఓ రకంగా.. అవి లేవనే చెప్పుకోవాలి. గతంలో ఉన్న కార్యకలాపాలు కూడా.. చాలా కాలంగా తగ్గిపోయాయి. ఆరెస్సెస్ సాయంతో భావజాలం వ్యాప్తి చేస్తేనే.. బీజేపీ సిద్ధాంతపరంగా మెరుగుపడుతుందనే భావనతో బీజేపీ ఉంది. నేతల చేరికలతో.. నాయకత్వం పరంగా బలపడినప్పటికీ.. కింది స్థాయిలో మాత్రం బీజేపీకి నిరాశ తప్పడం లేదు. ఈ లోటును పూడ్చటానికి ఆరెస్సెస్‌తో సుదీర్ఘ కాలం పయనించిన నేతను ఏపీకి గవర్నర్‌గా పంపినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో రెండో సారి బీజేపీ అధికారంలోకి రాగానే .. టీడీపీపై గురి పెట్టింది. టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో కథ ప్రారంభించింది. సుజనాలాంటి నాయకులను ముందు పెట్టి కొంతవరకు కథ నడుపుతోంది. ఢిల్లీ నాయకులు తరుచుగా.. ఏపీలో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ నియామకం.. వ్యూహాత్మకంగా వేసిన ముందడుగు. ముందునుంచీ సంఘ్‌తో అనుబంధం ఉండి.. మోదీ, షా మార్క్ రాజకీయాలకు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే బిశ్వభూషణ్‌ను నియమించడం.. ఓ లెక్క ప్రకారమే జరగింది. మోదీ హయాంలో గవర్నర్లకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. వారిచ్చే రిపోర్టులకే కాదు.. కీలక సమయాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకోవడం.. ప్రభుత్వాలను సైతం ప్రభావితం చేసే రీతిలో గవర్నర్లు బలపడ్డారు.

ఓ వైపు పునాదుల్ని బలపరుచుకోవడమే కాదు… ఇతర పార్టీలను బలహీనం చేసే ప్రక్రియ కూడా ఉంది. చంద్రబాబు తరహాలోనే జగన్‌ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు నెలన్నరలోనే ఆరోపణలు ప్రారంభించారు. పీపీఏల విషయంలో.. జగన్‌కు ప్రత్యేకంగా లేఖలు రాసింది. విద్యుత్‌ ఒప్పందాల సమీక్షలాంటి నిర్ణయాలు.. వద్దని చెప్పింది. అయినా.. జగన్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో బీజేపీ నేతలిప్పుడు.. చంద్రబాబుకు పట్టినగతే జగన్‌కు పడుతుందని నేరుగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా.. ఏపీలో బహుముఖంగా.. బీజేపీ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోందని.. వీటన్నింటిని చూసి అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com