ఒక్క సంతకం పెడితే అయ్యే పనికి కోటి సంతకాలా?

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు ఆ పని చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింది. ప్రజాగ్రహానికి గురయిన ఆ పార్టీ రాష్ట్రంలో క్రమంగా తుడిచిపెట్టుకుపోతుంటే దాని ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆ పార్టీ నేతలు ప్రత్యేక హోదా పేరిట డ్రామాలు ఆడుతున్నారని అందరికీ తెలుసు. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల కార్యక్రమం, ఆ తరువాత మట్టి సత్యాగ్రహం, ఇప్పుడు ఛలో డిల్లీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 22 నెలల్లో ఏనాడూ పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రత్యేక హోదా గురించి గట్టిగా పట్టుపట్టిన దాఖలాలు లేవు కానీ ఏదో ఒక సాకుతో స్థంభింపజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మళ్ళీ నిన్న ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటులో గట్టిగా ఒత్తిడి చేసింది కానీ నేటితో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. కనుక ఇక ఆ అంశంపై పార్లమెంటులో చర్చ కొనసాగే అవకాశం లేదు. కనుక అది చేసిన ప్రయత్నం వృధా అయినట్లే భావించవచ్చును.

పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, శైలజానాథ్ తదితర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రత్యేక హోదా కోసం తాము రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను ఈరోజు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేసి, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఇంకా ఒత్తిడి తేవలసిందిగా కోరుతారని తెలుస్తోంది. అయితే యూపియే ప్రభుత్వమే ఈ ప్రత్యేక హోదా ప్రతిపాదనను చేసినప్పుడు, దానిని విభజన చట్టంలో చేర్చి ఉండి ఉంటే నేడు ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం, ఆ అవకాశం లేకపోవడం చేతనే ఆనాడు ఆ హామీని విభజన చట్టంలో చేర్చలేదని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి చెప్పారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న డా.మన్మోహన్ సింగ్ ఒక్క సంతకం చేస్తే అయిపోయే పని కోసం ఇప్పుడు కోటి సంతకాలు చేయిస్తున్నారని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని అందరికీ తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com