ప్రభుత్వఉద్యోగుల పదవీ విరమణపై ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. రిటైర్మెంట్ ను వయసుతో పాటు సర్వీసు కాలంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో ఇది 62 ఏళ్లు . అయితే, ఆంధ్రప్రదేశ్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ GPS చట్టం , పాత సర్వీసు నిబంధనల్లోని రూల్ 44 ప్రకారం.. ఒక ఉద్యోగికి 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే, వయసుతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వారిని రిటైర్ చేయవచ్చనే నిబంధన తెరపైకి వచ్చింది. దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
గత ప్రభుత్వంలోని ప్రతిపాదన
వైసీపీ హయాంలో దీనిపై ప్రతిపాదన వచ్చింది. ప్రాథమికంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో పక్కన పెట్టారు. ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయడానికి ప్రధానంగా రెండు ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిది, సుదీర్ఘ కాలం సర్వీసులో ఉన్న వారిని పంపించి, కొత్త రక్తాన్ని ఉద్యోగాల్లోకి తీసుకోవడం ద్వారా పరిపాలనలో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండవది, ఆర్థిక భారం. 62 ఏళ్ల వరకు వేతనాలు, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించడం కంటే, 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి పెన్షన్ ఇచ్చి పంపడం వల్ల దీర్ఘకాలంలో ఖజానాపై భారం తగ్గుతుందని ఒక అంచనా.
30ఏళ్లలోపు ఉద్యోగం వచ్చినా పెద్దగా మార్పు ఉండదు !
ఈ ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 20-22 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరిన వారు ఈ నిబంధన వల్ల 53-55 ఏళ్లకే రిటైర్ కావాల్సి వస్తుంది. దీనివల్ల వారి కెరీర్ చివరి దశలో వచ్చే పదోన్నతులు, పెరిగిన వేతనాలు కోల్పోతారని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒకప్పుడు ఇలా ఇరవైల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నోటిఫికేషన్లు వచ్చి ఇరవైల్లో దరఖాస్తు చేసినా ఉద్యోగం వచ్చే సరికి ముఫ్పైలకి చేరిపోతున్నారు. అందుకే ఎక్కువ మందిపై ఎఫెక్ట్ ఉండమన్న వాదన కూడా ఉంది.
ఉద్యోగసంఘాలు వ్యతిరేకిస్తే అమల్లోకి రావడం కష్టమే!
వయసుతో సంబంధం లేకుండా రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల నైపుణ్యం కలిగిన, అనుభవం ఉన్న అధికారులు ఒక్కసారిగా వ్యవస్థ నుంచి తప్పుకునే ప్రమాదం ఉందని ఉద్యోగ నేతలు అంటున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి మేలు చేసినా, మరోవైపు కీలక విభాగాల్లో శూన్యం ఏర్పడవచ్చు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇది అందరికీ వర్తించదని, కేవలం పనితీరు సరిగా లేని వారికి లేదా ప్రజా ప్రయోజనార్థం మాత్రమేనని సంకేతాలు ఇస్తోంది. ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తే ప్రభుత్వం అమల్లోకి తెచ్చే అవకాశం లేదు.
