-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ప్రకటన ఆహ్వానించదగిందే. ఆ స్థాయి నగరం మన రాష్ట్రంలో ఉందని గొప్పలు చెప్పుకోడానికి మన మనవళ్ళకి అవకాశం దక్కుతుంది దీనివల్ల. కానీ, అలా కావాలంటే ఏం చేయాలి. అంత అద్భుతమైన నగరాన్ని నిర్మించాలంటే ఏదవసరం. అన్నిటికీ ఒకటే సమాధానం ధనం. ఏపీ విభజన అయిన వెంటనే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. రాజధాని నగర నిర్మాణానికి నాలుగైదులక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు. ప్రస్తుత ప్రకటన సారాంశం ప్రకారం ఆ మొత్తంకూడా సరిపోదు. సరిపోతుందో సరిపోదో.. ముందు అంతమొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలన్నదే ఇప్పుడు ప్రశ్న.
రాజధాని నిర్మిస్తామని రైతుల నుంచి సమకూర్చుకున్న వేలాది ఎకరాలను ఇప్పుడు ఇందుకోసం వినియోగించబోతున్నారు. ఇందులో నాలుగువేల ఎకరాలను పక్కనుంచుతారట. అవసరమైన మొత్తం సమకూర్చుకోవడానికి వీటిని తాకట్టు పెడతారట. అమరావతిలో మౌలిక సదుపాయల కల్పనకు 32, 463 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నది ప్రభుత్వ తాజా ప్రతిపాదన. మెకన్సీ సంస్థ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అప్పట్లో ప్రతిపక్షాలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరోపణలకు ఓట్రిచ్చిన అధికార పక్షం ఇప్పుడు చేస్తున్న వాదన విచిత్రంగా ఉంది. నాలుగువేల ఎకరాలను తాకట్టు పెట్టి, ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకుని, భూముల రేట్లు పెరిగాక వాటిని అమ్మేసి, తీర్చేస్తుందట. తాకట్టులో ఉన్న భూములను ఎలా అమ్ముతుందన్నది అసలు ప్రశ్న. ఎవరైనా బంగారాన్ని తాకట్టు పెట్టి.. ధర పెరిగిన తరవాత అమ్మేసి తీర్చడం కుదురుతుందా.. తాకట్టు పెట్టుకున్నవాడే ఆ పని చేసుకోగలడు కదా. ఇలాంటి చర్యలు ప్రజలను సహజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇదెలా సాధ్యమని భృకుటి ముడేస్తున్నారు.
ఖజానా బోసిపోయి ఉన్న తరుణంలో అప్పు తేవడం తప్ప గత్యంతరం లేదని అందరికీ తెలుసు. తాకట్టుపెట్టి, రేటొచ్చిన తరవాత అమ్మేసి, అప్పు తీర్చేస్తామన్న లాజిక్ వారి బుర్రకు అందడం లేదు మరి. సేకరించిన 33 వేల ఎకరాల్లో 4వేల ఎకరాలను ఈవిధంగా ఉపయోగించుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారమవుతుందో కాదో ప్రభుత్వమే వివరించాలి. పైగా ఈ చర్య ప్రతిపక్షాలకు వజ్రాయుధం లాంటి అవకాశాన్ని అందిస్తుంది కూడా. సదావర్తి భూముల వ్యవహారం మాదిరిగానే ఇది తయారవుతుందన్న అనుమానాలూ వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేస్తే, లబ్ధిపొందేదెవరో వేరే చెప్పాల్సిన అవసరముందా. రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడుతుంటే ఇలాంటి పనులకు పూనుకుంటారా అనేది నేను వేస్తున్న ప్రశ్న. రాజధాని అంశంలో ఆదినుంచి ఏపీ ప్రభుత్వం పారదర్శకతకూ దూరంగానే ఉంటూ వస్తోంది. రాజధానిని సింగపూర్ ఉచితంగా నిర్మించిస్తుందని చెబుతూ వచ్చిన బాబు సర్కారు ఇప్పుడిన్ని వేల కోట్లు ఎందుకన్న ప్రశ్నకు బదులు చెప్పగలదా.