అదుగో పులి అంటే… ఇదుగో తోక అనడంలో మీడియా తర్వాతే ఎవ్వరైనా. ఇప్పుడు గాలి జనార్థన్‌రెడ్డి ఇంట పెళ్ళి సందడి విషయంలో కూడా అలాంటి వార్తలనే షురూ చేసింది. అవినీతి, అక్రమ వ్యవహారాలతో జైలుకు వెళ్ళినప్పుడు పోయిన పరువును, ఇప్పుడు ఈ పెళ్ళి కార్యక్రమం ద్వారా తిరిగిరాబట్టుకోవాలని చూస్తున్నాడు గాలి. అందుకోసమని ఈ పెళ్ళిని కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చు పెట్టిగా భారీగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే దేశంలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరినీ కూడా ఈ పెళ్ళికి ఆహ్వానించనున్నాడు. అయితే శ్రీ గాలిగారు ఆహ్వాన పత్రికలు ఇచ్చే ప్రయత్నాల్లో ఉండగానే… మీడియా మాత్రం ఆయా ప్రముఖులు పెళ్ళికి అటెండ్ అవుతారన్నట్టుగా వార్తలు రాసేస్తున్నారు.
వేరే ఏ కార్యక్రమమైనా ఒకె కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో గాలిగారితో రాసుకుపూసుకు తిరగడమంటే ఇమేజ్‌ని ఫణంగా పెట్టడమే. అంతర్గతంగా ఎంతమందికి ఎలాంటి సంబంధాలు ఉన్నా ఇప్పుడు వాటిని బయట పెట్టుకునే ప్రయత్నాలు అయితే అస్సలు చేయరు. రాజకీయ నాయకులు కూడా గాలితో సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనడంలో సందేహం లేదు. అవినీతి ఆరోపణలలో నిత్యం మునిగితేలుతూ ఉండే పొలిటీషియన్సే ఆ రేంజ్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇక సినిమా స్టార్స్ ఏ స్థాయిలో ఆలోచిస్తారు? బాలీవుడ్ స్టార్స్ వ్యవహారం ఎలా ఉన్నా టాలీవుడ్ స్టార్స్‌కి మాత్రం వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా చాలా ముఖ్యం. పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేయడానికి కోట్లలో అమౌంట్ పుచ్చుకుని వెళ్తూ ఉండే షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవుతారేమో తెలియదు కానీ టాలీవుడ్ స్టార్ హీరోస్ మాత్రం అటెండ్ అయ్యే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఈ రోజు మీడియాలో వచ్చినట్టుగా ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్‌లు వెళ్ళే అవకాశం అస్సలు లేదు. పొలిటికల్ విభేదాల దృష్ట్యా కూడా ఎన్టీఆర్ ఈ పెళ్ళికి అటెండ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ అటెండ్ అయితే మాత్రం ఎన్టీఆర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా బంపర్ అవకాశం ఇచ్చినట్టే. సోషల్ మీడియా యాక్టివ్‌గా లేని కాలం విషయం పక్కన పెడితే ఇఫ్పుడు మాత్రం తప్పు చేసిన వాళ్ళనే కాదు…అలాంటి వాళ్ళతో తిరిగే వాళ్ళను కూడా సోషల్ మీడియా జీవులు ఏకిపారేస్తున్నారు. అయినా స్వయంగా ఆ స్టార్స్ చెప్పిన తర్వాతనో, లేక ఆ పెళ్ళికి అటెండ్ అయ్యిన తర్వాతనో వార్తలు రాస్తే బాగుంటుంది కానీ ఇప్పుడే ఊహాగానాలు చేసి వాళ్ళ ఇమేజ్‌కి భంగం కలిగించే ప్రయత్నం చేయడం మాత్రం భావ్యం అనిపించుకోదు.