ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కార్పొరేషన్లలో వార్డు సభ్యుల సంఖ్యను జనాభా ప్రాతిపదికన సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2005 నాటి నిబంధనలకు సవరణలు చేస్తూ, పెరిగిన జనాభాకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశాలతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, 2 లక్షల లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లలో 60 మంది సభ్యులు, 2 నుంచి 3 లక్షల జనాభా ఉంటే 62 మంది సభ్యులు ఉండనున్నారు. జనాభా పెరిగే కొద్దీ ఈ సంఖ్య కూడా పెరుగుతూ, 3 నుండి 10 లక్షల మధ్య ఉన్న చోట 66 నుండి 76 వరకు సభ్యులు ఉంటారు. ఇక 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రో తరహా కార్పొరేషన్లకు గరిష్టంగా 120 మంది సభ్యులను కేటాయించారు. ఈ మార్పుల వల్ల అభ్యర్థుల సంఖ్య పెరగడమే కాకుండా, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం మరింత మెరుగుపడనుంది.
మున్సిపల్ కార్పొరేషన్లలో రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతున్నప్పటికీ, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించింది. ముఖ్యంగా లోటు బడ్జెట్లో ఉన్న సంస్థలు తమ నిధులను, 16వ ఆర్థిక సంఘం లేదా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పరిపాలనా అవసరాలకు మళ్లించకూడదని స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచే విషయంలో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలను రూపొందించింది.
1996 నాటి నిబంధనల ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ డెలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండటంతో, ఏపీలో మున్సిపల్ రాజకీయాలు ప్రారంభం కానున్నాయి.


