ఉపయోగించలేక.. నిర్వహణ లేక రుషికొండ ప్యాలెస్ శిథిలమవుతోందని పవన్ కల్యాణ్ పర్యటనతో బయటపడటంతో ప్రభుత్వం అప్పటికప్పుడు .. ఆ ప్యాలెస్‌ను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీ సిఫారసులు చేయనుంది.
రుషికొండ ప్యాలెస్ గురించి మొత్తం తెలిస్తే.. ప్రజాధనాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఎలా వృధా చేశారన్న ఆవేదన కలుగుతుంది. అంతకు ముందు అక్కడ టూరిజం రిసార్టులు ఉండేవి. ఎంతో మందికి ఆహ్లాదకరమైన విశ్రాంతిని ఇచ్చేవి. టూరిజానికి ఏటా ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. వాటిని కూలగొట్టేసి.. గొప్ప స్టార్ హోటల్ కడతామని చెప్పి.. ప్యాలెస్ కట్టుకున్నారు. ఐదు వందల కోట్ల ఖర్చు అయింది… కానీ ఇప్పుడా కట్టడం హోటల్ కు పనికి రాదు. ఫంక్షన్స్ కు పనికి రాదు. ప్రభుత్వ కార్యక్రమాలకు వాడాలంటే.. సూపర్ లగ్డరీ అయిపోతుంది.
దాన్ని ప్రైవేటుకు లీజుకు ఇవ్వడమే మార్గం.అయితే పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆదాయం వస్తుందా అన్నది మాత్రం చెప్పడం కష్టం. దానికి తగ్గ ఆదాయం వచ్చేలా చూడకపోతే.. లాస్ ప్రాజెక్ట్ అవుతుంది. మంత్రివర్గ ఉపసంఘం ముందు ఇప్పుడు ఈ క్లిష్టపరిస్థితి ఉంది. ఎలాగైనా.. మరో మూడు, నాలుగునెలల్లో అయినా ఆ భవనాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.