మీరు..మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ.. కల్తీ నెయ్యిపై జరుగుతున్న చర్చలో అచ్చెన్నాయుడు ఓ సందర్భంలో పదం ప్రయోగించారు. దీనిపై మండలి చైర్మన్ ఉలిక్కి పడ్డారు. ఎవర్ని క్రిస్టియన్ అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో మీరు క్రిస్టియన్ కాదంటే ..తప్పు మాట్లాడినట్లుగా ఒప్పుకుని క్షమాపణ చెబుతానన్నారు. క్షణం కూడా ఆలోచించకుండా మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తాను క్రిస్టియన్ ను కాదని హిందువునని చెప్పుకున్నారు. దాంతో అచ్చెన్నాయుడు వెంటనే తనకు భేషజాలు లేవని..మీరు క్రిస్టియన్ అనుకున్నానని.. కాదని చెప్పినందుకు తప్పు అంగీకరిస్తున్నానన్నారు. క్షమాపణ చెబుతున్నాన్నారు.
అయితే కొయ్యే మోషేన్ రాజు తాను క్రిస్టియన్ అన్న విషయంపైనే అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ క్రిస్టియన్ అన్న మాటలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వైసీపీ సభ్యులకు ఇదేదో ట్రాప్ లాగా అనిపించడంలో అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పినా ఆందోళన విరమించలేదు. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై చర్చలో వైసీపీ సభ్యులు చర్చ కంటే ఏదో ఓ గొడవ చేసి సభను సాగకుండా చేద్దామన్నా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అవసరం లేకపోయినా దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ కూడా ఆయనపై అసహనం వ్యక్తం చేశారు.
చర్చ సందర్భంగా అధికార కూటమి , ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ అనూరాధ వంటి వారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందని ఆరోపించారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హెరిటేజ్ సంస్థ ప్రస్తావన తెచ్చారు. గత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న నెయ్యి సరఫరాదారుల నుంచి దాదాపు రూ.4.69 కోట్లు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. దీనిపై 36 మందిని నిందితులుగా చేర్చినట్లు వెల్లడించారు. చర్చలో ఇరుపక్షాల మధ్య దూషణలు పెరగడం, ఒకరిపైకి ఒకరు వెళ్లే ప్రయత్నం చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ ప్రొసీజర్ గురించి అభ్యంతరం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య సభ పలుమార్లు అంతరాయానికి గురైంది.


