ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఆరు నెలల్లో ఉంటాయని చంద్రబాబు చెబుతున్నారు. అంత కంటే ముందే రావొచ్చు. సాధారణంగా అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య పోరు ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి వర్సెస్ వైసీపీ కంటే కూడా కూటమి వర్సెస్ కూటమి అన్నట్లుగా క్షేత్రస్థాయి పరిస్థితులు మారనున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది కేవలం రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, అది గ్రామ స్థాయి కార్యకర్తల ఉనికికి సంబంధించిన ప్రశ్నగా మారింది.
ద్వితీయ శ్రేణి నేతల మధ్య కలహం ఖాయం
నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఏ పార్టీకైనా వెన్నెముక. క్షేత్రస్థాయిలో పోరాడిన టీడీపీ కార్యకర్తలు, తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అదే సమయంలో, జనసేన పుంజుకున్న ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు. ఈ ఇద్దరి మధ్య కొన్ని చోట్ల బీజేపీ నేతలు కూడా తమ వాటాను కోరుతుండటంతో, కూటమిలో ముక్కోణపు అంతర్గత పోరు మొదలైంది. ఒకే సీటు కోసం ముగ్గురు మిత్రులు పోటీ పడటం అనేది కూటమి ఐక్యతకు పెద్ద పరీక్షగా నిలవనుంది. వైసీపీ ప్రస్తుతం డిఫెన్స్‌లో ఉన్నప్పటికీ, కూటమిలో వచ్చే చిన్నపాటి విభేదాల కోసం ఆ పార్టీ వేచి చూస్తోంది. కూటమి పార్టీల మధ్య టిక్కెట్ల కేటాయింపులో ఏమాత్రం అసంతృప్తి కలిగినా, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
క్యాడర్ ఆశల్ని నెరవేర్చేది ఎలా?
మరో ప్రధాన సమస్య ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్, వర్గ పోరు ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గుర్తును చూసి ఓటు వేసిన ప్రజలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలను, తమ సామాజిక వర్గ సమీకరణాలను చూస్తారు. ఇక్కడ పార్టీల మధ్య కుదిరిన పొత్తు కంటే, స్థానిక నేతల మధ్య ఉన్న పంతం ఎక్కువగా పనిచేస్తుంది. ఒక గ్రామంలో టీడీపీ నేతకు, జనసేన నేతకు మధ్య పాత గొడవలు ఉంటే, వారు పైకి చేతులు లిపినా లోపల ఒకరినొకరు ఓడించుకునే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి కూటమి అగ్రనాయకత్వం ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అగ్రస్థాయిలో అవగాహన.. కింది స్థాయిలోనూ రావాలి!
ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో గెలుపు గుర్రాలు ఎవరనేది తేలకముందే, కూటమి పార్టీలు తమలో తాము ఒక అవగాహనకు రావడం అతిపెద్ద సవాలుగా మారింది. వైసీపీని ఎదుర్కోవడం కంటే, తమ పార్టీ కేడర్‌ను శాంతింపజేయడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలకు కత్తిమీద సాము లాంటి వ్యవహారం. ఈ అంతర్గత చిక్కుముడులను ఎవరు నేర్పుగా విప్పుతారో, వారికే స్థానిక సంస్థల్లో అధికారం దక్కుతుంది. అసంతృప్త నేతలకు నామినేటెడ్ పదవుల హామీ ఇచ్చి బుజ్జగించకపోతే, స్థానిక సంస్థల ఫలితాలు కూటమికి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉంది.


