ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సందడి మళ్లీ మొదలవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏప్రిల్‌తో రాష్ట్రంలోని ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీల పదవీకాలం ఇప్పటికీ పూర్తయింది. అందుకే మే నెలలో అంటే వేసవి సెలవుల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం , ఎన్నికల సంఘం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
వేసవిలో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు పాఠశాల భవనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉపాధ్యాయులు ,ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించడం యంత్రాంగానికి సులువు అవుతుంది. అటు పార్టీలు కూడా తమ కేడర్‌ను సమాయత్తం చేసుకోవడానికి ఇది అనువైన సమయంగా భావిస్తున్నాయి. జగన్ తెచ్చిన చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణ రెండు వారాల్లో పూర్తయిపోతుంది.
ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం కొన్ని కీలక చట్ట సవరణలను కూడా తెరపైకి తెచ్చింది. గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ను తీసేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవాల విషయంలో జరిగిన గందరగోళం పునరావృతం కాకుండా, పూర్తి పారదర్శకతతో ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియపై ఎస్ఈసీ ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 వేలకు పైగా పంచాయతీలు, 120కి పైగా మున్సిపాలిటీలు , కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి స్థానిక సమరం కావడంతో, అటు అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
