ఫెవీ క్విక్ గా మారిన ప్రత్యేక హోదా అంశం

రాష్ట్ర విభజన అనివార్యం అని తెలిసి ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో సమైక్యాంద్ర ఉద్యమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో నెలకొన్న బలమైన సెంటిమెంటుని అన్ని రాజకీయ పార్టీలు ఏవిధంగా క్యాష్ చేసుకోవాలనుకొన్నాయో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదాని సెంటిమెంటుగా మార్చి క్యాష్ చేసుకోవాలనుకొంటున్నాయి. అది సజీవంగా ఉంటే తెదేపా, భాజపాలకి నష్టం. ఉంటేనే ప్రతిపక్షాలకి లాభం. కనుక దానిని మరిపించాలని తెదేపా, భాజపాలు, దానిని సజీవంగా ఉంచేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రానికి మేలు చేకూర్చవలసిన ప్రత్యేక హోదా చివరికి రాజకీయ పార్టీలకి చావుబ్రతుకుల సమస్యగా మారి మిగిలిపోయింది.
ఈవిషయంలో తెదేపా, భాజపాలు మొదట కీచులాడుకొన్నా ఇప్పుడు రెండూ విడిపోవడం లేదా కలిసి ఉండటం వలన కలిగే లాభనష్టాల లెక్కలని, తమ విభేదాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలని ఎదుర్కొంటున్నాయి. నిజానికి ఈ పని అవి మొదటే చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. కానీ ఈ లాభనష్టాల లెక్కలు చూసుకొంటూ ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటూ, ప్రతిపక్షాలకి కూడా వాటిపై కత్తులు దూసేందుకు అవకాశం కల్పించాయి. ప్రత్యేక ప్యాకేజి విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ లెక్కలని చూసుకొనే డిల్లీ వెళ్ళలేదని చెప్పవచ్చు. వెళ్ళి ఉంటే భాజపాతో సమానంగా తెదేపా కూడా ప్రజాగ్రహానికి గురయ్యేది. అలాగని అది కూడా పూర్తిగా తప్పించుకోలేదు కానీ భాజపాతో పోలిస్తే చాలా నయమే.

ఆ సంగతి భాజపా అధిష్టానానికి కూడా అర్ధం అయినట్లే ఉంది. అందుకే వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. మొదట అందుకు కారకుడైన పవన్ కళ్యాణ్ పై నిప్పులు చేరింది కానీ ఆవిధంగా చేస్తే ప్రజలలో భాజపా పట్ల వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని గ్రహించి ఆయనతో రాజీ పడేందుకు సిద్దం అయ్యింది. అదేవిధంగా భాజపాకి తెదేపా నష్టం కలిగిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో దానిని దూరం చేసుకొంటే అది ఇంకా ఎక్కువ నష్టం చేస్తుందని గ్రహించి దానితో కూడా రాజీకి సిద్దపడింది. కేంద్రప్రభుత్వం సహాయసహకారాలు అవసరం ఉంది కనుక తెదేపా కూడా మెత్తబడింది. ప్రస్తుతానికి వాటికి అంతకంటే వేరే మార్గం లేదు కూడా.

కనుక ప్రత్యేక హోదా అంశమే ‘ఫెవీ క్విక్’ లాగ వాటిని కలిపి ఉంచుతుంటే, అదే ప్రతిపక్షాల మద్య ఐక్యత ఏర్పడేందుకు దోహదపడుతోంది. ప్రత్యేక హోదా రాకపోవడం వలన రాష్ట్రం చాలా నష్టపోతుందని వాదిస్తున్న ప్రతిపక్షాలు అది నిరూపించేందుకు విశ్వప్రయత్నాలు చేయడం తధ్యం. కనుక ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి తీసుకోవడం వలన రాష్ట్రం ఏ మాత్రం నష్టపోలేదని నిరూపించవలసిన బాధ్యత తెదేపా, భాజపాలపైనే ఉంటుంది. మిగిలిన రెండున్నరేళ్ళలో ప్రజల కళ్ళకి కనబడే అంతగా అవి రాష్ట్రాభివృద్ధి చేసి చూపవలసి ఉంటుంది అప్పుడే ప్రజలు కూడా వాటిని క్షమిస్తారు. 2019 ఎన్నికలలో ప్రజలు తీర్పు చెపుతారు. కనుక అంతవరకు అధికార ప్రతిపక్షాలు ఎన్ని ఆటలైన ఆడుకోవచ్చు. ఎన్ని మాటలైన నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com