ముగిసిన వనజాక్షి వివాదం

హైదరాబాద్: మొత్తానికి వనజాక్షి వివాదం సమసిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో వనజాక్షి, రెవన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు శాంతించారు. పశ్చిమ గోదావరిజిల్లా ముసునూరు తాసీల్దారు వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గీయులు దాడిచేయటం, రెవెన్యూ ఉద్యోగసంఘాలు సమ్మెకు దిగటం తెలిసిందే. వనజాక్షి, రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అరెస్టుకు డిమాండ్ చేశారు. చర్చల అనంతరం బయటకొచ్చిన వనజాక్షి, ఉద్యోగసంఘాల నాయకులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. నాటి సంఘటనపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి విచారణ జరిపిస్తానని సీఎమ్ హామీ ఇచ్చారని వనజాక్షి తెలిపారు. విచారణలో అన్నివిషయాలూ బయటకొస్తాయని చెబుతూ ఆమె మళ్ళీ కంటతడి పెట్టారు. కమిటీ విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, తాసీల్దారుపై దాడిసమయంలో ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపైనా కమిటీ విచారణ జరుపుతుందని హామీ ఇవ్వటంతో సోమవారంనుంచి విధులకు హాజరవుతామని ఉద్యోగసంఘాలనాయకులు చెప్పారు. మరోవైపు ఏలూరులో వనజాక్షిపై డ్వాక్రా సంఘాల మహిళలు(చింతమనేని మనుషులు) పెట్టిన కేసులు ఎత్తేయాలని సీఎమ్ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులపై దాడులు పునరావృతంకాకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు చింతమనేనికూడా సీఎంను కలిసి తన వాదన వినిపించారు. ఆయనను చంద్రబాబు మందలించారని, దూకుడు తగ్గించుకోవాలని సూచించారిని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com