కేసీఆర్‌ను తిట్టాడని..ఏపీ విద్యార్థి అరెస్ట్..! తెలంగాణ పోలీసులకు ఏపీ పైనే గురి..?

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే… తెలంగాణ నుంచి కొన్ని వందలు, వేల వీడియోలు.. ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను.. ఇంకా చెప్పాలంటే.. ఆంధ్ర ప్రజలను తిట్టే వీడియోలు కోకొల్లలుగా ఉంటాయి. అంత మాత్రాన ఫిర్యాదు చేస్తే.. అందర్నీ అరెస్ట్ చేస్తారా..? అది సాధ్యమేనా..?. కానీ తెలంగాణ పోలీసులకు మాత్రం సాధ్యమే. ఓ టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన నేత.. ఒకరు… ఓ యువకుడు.. కేసీఆర్ ను తిడుతూ.. సోషల్ మీడియాలో వీడియో పెట్టారని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇంకేం పని లేనట్లు.. తమకు ఆ ఫిర్యాదును మించిన ప్రాధాన్యత మరో దానికి లేదన్నట్లుగా.. ఉన్న పళంగా కేసులు నమోదు చేసి… కేసులు పెట్టేసి.. ఆ కుర్రాడ్ని అరెస్ట్ చూపించారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. ఓ డిగ్రీ విద్యార్థి. కృష్ణా జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల తగరం నవీన్‌.. డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ట

ఈ నెల 14న స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నాడు. వేడుకల్లో మద్యం సేవించి.. కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. దాన్ని టిక్ టాక్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా టీఆర్ఎస్ నేతలు.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అరెస్ట్ చూపించారు. నవీన్‌పై ఐపీసీ సెక్షన్ 153(ఏ), ఐటీ యాక్ట్ సెక్షన్ 67ల కింద కేసులు నమోదు చేసి…నేరుగా కమిషనరే మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వాధినేతలు, అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం చట్టరిత్యా నేరమని.. చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఏపీలో ఉన్న వ్యక్తులపై ఫిర్యాదులు వస్తే… తెలంగాణ పోలీసులు స్పందించే తీరు ఇంతే ఉంటోంది. అదే తెలంగాణలో జరుగుతున్న నేరాలపై.. ఏమైనా ఫిర్యాదులు వస్తే మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో.. రాజకీయనాయకుల్ని.. తిడుతూ పెట్టే పోస్టులు.. కొన్ని వందలు.. వేలు కాదు.. లక్షలు ఉంటాయి. అంత మాత్రాన కేసులు పెట్టుకుంటూ పోతే… జైళ్లు సరిపోవన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో.. షర్మిల ఫిర్యాదు విషయంలోనూ పోలీసులు ఇలాగే స్పందించారు. కామెంట్లు చేశారంటూ.. ఓ ఏపీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. చిన్న చిన్న ఫిర్యాదులకు కూడా.. ఏపీలోని వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూండటం.. కొత్త చర్చకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com