ఈ వేసవిని చిత్రసీమ సరిగా వాడుకోవడం లేదేమో అనిపిస్తోంది. పెద్ద సినిమాల హడావుడి అస్సలు కనిపించడం లేదు. చిన్న సినిమాలు వచ్చినా, థియేటర్లో జనం ఉండడం లేదు. వారం వారం సినిమాలు వస్తున్నా, పట్టించుకొనే నాధుడే లేకుండా పోయాడు. క్రేజ్ ఉండి, పబ్లిసిటీ చేసుకొని కూడా జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోతున్నారు. అసలు జనం ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు? అనేది పెద్ద ఫజిల్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈవారం రెండు సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఒకటి డబ్బింగ్ బొమ్మ. మరోటి చిన్న సినిమా.
‘గేదెల రాజు’ అనే ఓ సినిమా ఈవారం విడుదల కాబోతోంది. రఘు కుంచె ప్రధాన పాత్రధారి. ఆయన నిర్మాత కూడా. సంగీతం ఆయనే అందించారు. గతవారం విడుదల కావాల్సిన సినిమా ఇది. వారం ఆలస్యమైంది. ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు మలయాళంలో హిట్టయిన ‘వాలా 2’ని తెలుగులో డబ్ చేశారు. ఇది కూడా ఈవారమే వస్తోంది. మలయాళంలో దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. యూత్ ఫుల్ కాలేజీ స్టోరీ. ఇలాంటి కథలు తెలుగులోనూ నడుస్తాయన్న నమ్మకంతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రెండూ చిన్న సినిమాలే. ప్రమోషన్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది అనుమానమే. టాక్ బాగున్నా.. ప్రేక్షకులు కనికరించడం లేదు. కొద్దో గొప్పో టికెట్లు తెగాలంటే మాత్రం అద్భుతాలు చేయాల్సిందే.
