తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి కీలకమైన సవరణలు చేస్తూ జీఓ నంబర్ 124 జారీ చేసింది. ముఖ్యంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాంతాల్లో విమానాల రాకపోకల వల్ల కలిగే భారీ శబ్ద కాలుష్యం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశ్యం. దీని ప్రకారం, నోటిఫైడ్ నాయిస్ జోన్ పరిధిలో నిర్మించే అన్ని కొత్త భవనాలకు ధ్వని నిరోధక సామగ్రిని వాడటం ఇకపై తప్పనిసరి.
తెలంగాణ బిల్డింగ్ రూల్స్-2012కు చేసిన ఈ సవరణల ప్రకారం.. నివాస గృహాలు, అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు , వాణిజ్య సముదాయాలు ఏదైనా సరే, నిర్మాణ దశలోనే సౌండ్ ప్రూఫ్ పద్ధతులను పాటించాలి. విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు కలిగే జెట్ ఇంజిన్ల మోత ఇళ్ల లోపల వినిపించకుండా, కిటికీలు, తలుపులు , గోడల నిర్మాణంలో ప్రత్యేక ధ్వని నిరోధక మెటీరియల్‌ను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల ఇండోర్ వాతావరణం ప్రశాంతంగా ఉండటమే కాకుండా, శబ్ద కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
ఈ నిబంధనల అమలులో బిల్డర్లు , ప్రాపర్టీ యజమానులకు ప్రభుత్వం పూర్తి బాధ్యతను అప్పగించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన శబ్ద పరిమితులకు లోబడి నిర్మాణాలు ఉండాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ తుది అనుమతులు పొందే ముందే, నిర్దేశించిన ధ్వని నిరోధక ప్రమాణాలు పాటించినట్లు ఆధారాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
గతంలో ఎయిర్పోర్ట్ నాయిస్ జోన్లలో నిర్మాణాలపై ఉన్న కొన్ని అస్పష్టతలను ఈ కొత్త జీఓ తొలగించింది. నిబంధనలలో స్పష్టత రావడం వల్ల శంషాబాద్ ,పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న తరుణంలో, పౌర భద్రతను , పర్యావరణ హితాన్ని సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక స్మార్ట్ అర్బన్ ప్లానింగ్ అడుగుగా భావిస్తున్నారు.


