ముంబైలోని ప్రపంచంలోని అతి పెద్దమురికివాడ ధారావిని అభివృద్ధి చేస్తున్న తరహాలోనే విశాఖలోని స్లమ్స్ ను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నారు. విశాఖపట్నం నగరంలోని మురికివాడల రూపురేఖలను మార్చి, నగరాన్ని స్లమ్ ఫ్రీ గా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న 66 మురికివాడల్లోసమగ్ర సర్వేను ప్రారంభించింది. నివాస గృహాలు, మౌలిక సదుపాయాలు , ఇతర సదుపాయాలను అంచనా వేసి, వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోనుంది. ఈ సర్వే ఆధారంగా మురికివాడలను రెండు రకాలుగా వర్గీకరించి, వెనుకబడిన ప్రాంతాలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో పునర్నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా పైలెట్ ప్రాతిపదికన వేలంపేట , ఇందిరా నగర్ మురికివాడలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ రెండు ప్రాంతాలను అత్యాధునిక హైరైజ్ అపార్ట్మెంట్లుగా మార్చనున్నారు. వేలంపేటలో 177 కుటుంబాల కోసం G+12 అంతస్తుల భవనాన్ని, ఇందిరా నగర్లో 110 కుటుంబాల కోసం G+6 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. దాదాపు 40 కోట్లతో చేపట్టే ఈ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో అమలు చేస్తున్న స్లమ్ రీడెవలప్మెంట్ మోడళ్లను ఇక్కడ అనుసరిస్తున్నారు.
నిర్మాణ సమయంలో అక్కడి నివాసితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారులకు రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ఇచ్చింది. మొదటిది, ఇల్లు ఖాళీ చేసిన సుమారు 18 నెలల కాలానికి గాను ముందస్తుగా అద్దె నిధులు అందజేయడం. రెండోది, నిర్మాణ కాలంలో ప్రత్యామ్నాయ వసతి కల్పించడం. అయితే, దాదాపు 70 నుండి 80 శాతం మంది లబ్ధిదారులు తాము పని చేసే ప్రాంతాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో అద్దె నిధుల ఆప్షన్నే ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇళ్లు ఉచితంగా లభిస్తాయి. బిల్డర్లకు ప్రోత్సాహకంగా అదనపు టీడీఆర్ ,ఎఫ్ఎస్ఐ సదుపాయాలను కల్పిస్తున్నారు. నీటి సరఫరా, డ్రైనేజీ , అంతర్గత రోడ్ల వంటి ఉమ్మడి వసతుల బాధ్యతను కార్పొరేషన్ తీసుకోనుంది. నితీ ఆయోగ్ వైజాగ్ గ్రోత్ హబ్ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ చర్యలు విశాఖను గ్లోబల్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
