ఓటీటీ చేతుల్లోకి చిత్రసీమ మెల్లమెల్లగా వెళ్లిపోతోంది. సినిమా రిలీజ్ డేట్లని ఓటీటీలే నిర్ణయిస్తున్నాయి. ఓటీటీ ల నుంచి ఓ నికర మొత్తాన్ని ఆశిస్తున్న నిర్మాణ సంస్థలు ఓటీటీలు చెప్పినట్టు తలాడిస్తున్నాయి. ఓటీటీలు తమ సినిమాల్ని కొనడమే ధన్యం అనుకొంటున్న నిర్మాతలు.. వాళ్ల షరతులకు తలొగ్గడం అలవాటు చేసుకొంటున్నారు.
ఓ సినిమా కొనేముందు రకరకాల కండీషన్లు పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. ముందుగా సినిమా చూస్తున్నాయి. నచ్చితే కొంటున్నాయి.. లేదంటే లేదు. కొన్నప్పటికీ కొన్ని షరతులు విధిస్తున్నాయి. పెద్ద సినిమాలకు, క్రేజ్ ఉన్న సినిమాలకు ఓ బేస్ రేటు ఉంటుంది. సినిమా బాగా ఆడితే.. మరో 20 శాతం, 25 శాతం అదనంగా ఇస్తున్నారు. ఇది ఓకే.
సినిమా విడుదలై, ఆ సినిమా ఫలితాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇది చిన్న సినిమాల విషయంలో జరుగుతోంది.
మిడ్ రేంజ్ సినిమాల విషయంలో కొత్త ప్లాన్ అమలు చేస్తోంది. సినిమా రిలీజైన తరవాత, ఆ సినిమా బాక్సాఫీసు వసూళ్లలో 50 శాతం ఇస్తుంది. ఓ సినిమా బాక్సాఫీసు దగ్గర 100 కోట్లు సాధిస్తే, అందులో సగం అంటే 50 కోట్లు ఇస్తుందన్నమాట.
ఈ ప్లాన్ బాగానే ఉంది. సినిమా బాగుంటే, మంచి వసూళ్లు వస్తే, ఓటీటీల రూపంలో మంచి డబ్బులే వస్తాయి. కాకపోతే, బాక్సాఫీసు దగ్గర నికర వసూళ్లని ఎలా డిసైడ్ చేస్తారన్నది ప్రధానం. ఈ లెక్కలన్నీ నమ్మశక్యంగా ఉంటాయా? నిర్మాతలు పోస్టర్లపై వేసే మొత్తాలకూ, అసలు లెక్కలకు పొంతన ఉండదు. వాటిని ఓటీటీ సంస్థలు ఎలా నిర్ణయిస్తాయన్నది ఆసక్తికరం.
వసూళ్లకూ, ఓటీటీ రేట్లకు సంబంధం ఎందుకు అనుకొంటే, ఓటీటీలు ఇచ్చిన మొత్తానికి సర్దుకుపోయి సినిమాల్ని ఇచ్చేయడమే మార్గం. మరి.. ఈ విషయంలో నిర్మాతల ఆలోచనలు ఎలా ఉన్నాయో?
