ఈమధ్య ఈటీవీ విన్ తన జోరు చూపించుకొంటోంది. తెలుగు ఓటీటీల్లో ఇన్నేసి సినిమాలు తీస్తున్న సంస్థ ఈటీవీనే. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా ఈటీవీ విన్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. దాంతో పాటు 90 వెబ్ సిరీస్ కూడా నిలబెట్టింది. మూడు కోట్లలో సినిమా తీసి తమ సొంత ఓటీటీలో కంటెంట్ పెంచుకొంటూనే, కొత్త వాళ్లని ప్రోత్సహిస్తోంది. థియేటర్లో రిలీజ్ అయి, సక్సెస్ అయితే అది బోనస్ గా చూస్తోంది. ఈటీవి విన్ చేతిలో ఇప్పుడు ఏడెనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి.
అయితే… వరుసగా రెండు డిజాస్టర్లు ఈటీవి విన్ జోరుకు అడ్డు కట్ట వేసేలా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘సంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని’ డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి కేవలం ఓటీటీ కోసం తీసిన సినిమా అది. కానీ సినిమాని నమ్మి, గట్టిగా ప్రమోట్ చేశారు. కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ పరిస్థితి కూడా ఇంతే. ఇది వరకటి సినిమాల కంటే ఈటీవీ విన్ ఈసినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టింది. ఎప్పుడూ లేనంతగా ప్రమోట్ చేసింది. కానీ ఫలితం కనిపించలేదు. ‘సంప్రదాయినీ’ తో పోలిస్తే.. వసూళ్లు బెటర్ అంతే.
ఈటీవీ విన్ కి గతంలోనూ ఫ్లాప్ లు వచ్చాయి. కానీ ఆ సినిమాల్ని సరిగా ప్రమోట్ చేసుకోలేదు. ఈమధ్య మాత్రం గట్టిగా పబ్లిసిటీ చేస్తున్నాయి. కాబట్టే జనం నోళ్లలో సినిమాలు నానుతున్నాయి. థియేటర్లో సినిమా ఫ్లాప్ అయినా ఈటీవీ విన్ కి వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే… ఈటీవీ విన్ టార్గెట్ ఓటీటీనే. తమ ఓటీటీలో కొత్త బొమ్మ వస్తే చాలు. అంతే. కొన్ని సినిమాల్ని మిగిలిన ఓటీటీలకూ ఇచ్చేస్తోంది ఈటీవీ. ‘సంప్రదాయినీ..’ నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసింది. ఇప్పుడు ఈ ‘పాపం ప్రతాప్’ ఏం చేస్తుందో చూడాలి.
