విశాఖపట్నం పర్యాటక రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కార్డీలియా క్రూయిజస్ తన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రయాణాన్ని విశాఖ తీరం నుండి ప్రారంభించనుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ పర్యాటకానికి గేట్ వేగా మారబోతోంది. జూలై 15వ తేదీన విశాఖపట్నం నుంచి కార్డీలియా క్రూయిజస్ 14 రోజుల అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గతంలో కేవలం దేశీయంగా చెన్నై, ముంబై, కొచ్చి మధ్య సేవలందించిన ఈ లగ్జరీ షిప్, ఇప్పుడు నేరుగా ఆగ్నేయాసియా దేశాలకు విశాఖ వాసులను తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అరేబియా సముద్రం , బంగాళాఖాతం మీదుగా సాగే ఈ విహారయాత్ర పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ 14 రోజుల ప్రయాణంలో పర్యాటకులు ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌లు ,నగరాలను సందర్శించవచ్చు. ఈ ప్రయాణం విశాఖ నుంచి ప్రారంభమై చెన్నై , ఫుకెట్, కౌలాలంపూర్ , సింగపూర్ వరకు కొనసాగుతుంది. మధ్యలో సముద్రం మధ్యలో లగ్జరీ షిప్లో గడుపుతూనే, ఆయా దేశాల్లోని చారిత్రక కట్టడాలు , పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం ఒకే టికెట్‌తో మూడు దేశాలను సందర్శించవచ్చనేది ఈ క్రూయిజ్ ప్రత్యేకత.
పర్యాటకుల సౌలభ్యం కోసం వీసా ప్రక్రియను చాలా సులభతరం చేశారు. భారతీయులకు ప్రస్తుతం థాయిలాండ్,మలేషియా దేశాల్లో ప్రవేశానికి ఎటువంటి ముందస్తు వీసా అవసరం లేదు. ఇక సింగపూర్ విషయానికి వస్తే, షిప్ నుంచి దిగిన వెంటనే వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రయాణీకుల వద్ద ఖచ్చితంగా ఆరు నెలలకు పైగా వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఉండటం తప్పనిసరి. ఈ వెసులుబాటు వల్ల ప్రయాణీకులు ఎటువంటి వీసా టెన్షన్ లేకుండా విహారయాత్రను ఆస్వాదించవచ్చు.
కార్డీలియా ఎంప్రెస్ షిప్ లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. ప్రపంచ స్థాయి వంటకాలు, లైవ్ మ్యూజిక్, థియేటర్ షోలు, క్యాసినో, స్విమ్మింగ్ పూల్స్ , కిడ్స్ ప్లే ఏరియాలతో ఈ క్రూయిజ్ ఒక తేలియాడే నగరంలా ఉంటుంది.
