చంద్రబాబు,పవన్, జగన్….ముగ్గురూ అసమర్థులే

2014 ఎన్నికల సమయం. కాంగ్రెస్, బిజెపి పార్టీల ఓట్ల రాజకీయ క్రీడలో సీమాంధ్రులు బలయ్యారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అన్యాయమని ఎవ్వరూ చెప్పడానికి లేదు. కానీ సీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయం మాత్రం వాళ్ళ మనసులను తీవ్రంగా గాయపర్చింది. గుండెల్లో ఆందోళన రేకెత్తించింది. అప్పుడే ముగ్గురు డాక్టర్లు వాళ్ళ ముందుకు వచ్చారు. చంద్రబాబు, పవన్, జగన్. వీళ్ళతో పాటు వాళ్ళకు భజన చేసే మీడియాను కూడా తెచ్చుకున్నారు. 2014ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకూ ప్రజల తరపున పనిచేసిన మీడియా సంస్థలను వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు. సీమాంధ్రులను ఉద్ధరించే దేవుళ్ళం మేమే అని చంద్రబాబు, జగన్ చెప్పుకున్నారు. సాక్షి మీడియా జగనన్నే సరైనోడు అని చెప్పింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9లు చంద్రబాబు అంతకుమించి చెయగలిగినవాడు అని చెప్పాయి. అప్పటికప్పుడు బీభత్సమైన ఆవేశం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాటిక్ సభతో, పంచ్ డైలాగులతో పొలిటికల్ తెరంగేట్రాన్ని రెండోసారి చేసిన పవన్ కళ్యాన్ కూడా చంద్రబాబుకు జై అన్నాడు. నరేంద్రమోడీ, చంద్రబాబులు పొత్తు పెట్టకున్నారు కాబట్టి చంద్రన్నకు సపోర్ట్ చేసే మీడియా, టిడిపి జనాలు రాష్ట్ర విభజనలో బిజెపి పునీతురాలని, ప్రత్యేక హోదా రావాలంటే నరేంద్రమోడీనే గెలిపించాలని నమ్మకంగా…నమ్మేవరకూ తెగ ఊదరగొట్టారు.

2016…..ప్రత్యేక హోదా ఇచ్చే ఛాన్సేలేదని ఇప్పటికి చాలా సార్లు తేల్చి చెప్పింది బిజెపి. రెండేళ్ళ కాలం గడిచిపోయింది. ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటే మూడో ఏడాది పూర్తవ్వకముందే ఇవ్వాలి. నాలుగు, ఐదో సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి, మిగతా అన్నిరాష్ట్రాలతో గొడవలు తెచ్చుకునే పనిని ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. సీమాంధ్రులను ఉధ్దిరించడానికి రంగంలో ఉన్న చంద్రబాబు, జగన్, పవన్‌లకు ప్రత్యేక హోదా కోసం పోరాడటానికి ఉన్నది గట్టిగా ఏడాది సమయం. కానీ వీళ్ళు ముగ్గురూ ఏం చేస్తున్నారు. ఐదో ఏడాది కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల సంవత్సరం వచ్చినప్పుడు చంద్రబాబు కేంద్రప్రభుత్వం నుంచి ‘వీరోచితంగా’ బయటకు వస్తారు. మోడీని పిచ్చి తిట్లు తిడతారు. యువ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి రక్తం కూడా అప్పుడు ఉరకలెత్తుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి…ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న శ్రీ నరేంద్రమోడీవారు అప్పుడు ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్తారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్‌లో ఉన్న ‘పవర్’ స్టార్ నిద్రలేస్తాడు. అందరి పంచెలూ ఊడగొట్టండి….నేనొస్తున్నా…చించేస్తా……ప్రశ్నించేస్తా…..అని ఆయన స్టైల్‌లో చేతులను ఊపేస్తూ బయల్దేరతాడు. 2019 ఎన్నికల్లో మళ్ళీ ముగ్గురూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరకు వస్తారు. మిమ్ములను కాపాడుటకు, ఉద్ధరించుటకు వచ్చిన దేవుళ్ళం మేము అని ప్రచారం షురూ చేస్తారు. మీడియా కూడా చిడతలు వాయించడానికి రెడీ అవుతుంది. గెలుపోటములు ఎవరివైతే ఏంటి? శాశ్వితంగా ఓడిపోతూ ఉండేది మాత్రం ఓటర్లే.

ఇప్పటి నుంచీ 2018 ఎండింగ్ వరకూ చంద్రన్న, జగనన్న, పవనన్న చేసెడిది ఏంటిదయ్యా అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడాం అన్న క్రెడిట్‌ని ముగ్గురూ పంచుకునే ప్రయత్నం చేస్తారు. మేమే ఎక్కువ ఫైట్ చేశాం. మేం ఇంకా ఎక్కువ ఫైట్ చేశాం అని చెప్పుకుంటూ ఉండడం. తెలంగాణా ఉద్యమం అప్పుడు కూడా మనవాళ్ళు చేసింది ఇదే. ఎక్కడ కెసీఆర్‌కి క్రెడిట్ వచ్చేస్తుందో అని అవసరమొచ్చినప్పుడల్లా తెలంగాణా ప్రజలను మభ్య పెట్టడం కోసం సామాజిక తెలంగాణా అని ఇంకోటనీ జై తెలంగాణా నినాదాలు చేస్తూ, తెలంగాణా కోసం మేం కూడా పోరాడతాం అని చెప్తూ, అనుకూలమని చెప్పి లేఖలు రాస్తూ తాటాకు చప్పుళ్ళు చేసేవాళ్ళు. కానీ కేసీఆర్ అసాధ్యుడు కదా. ఆ తాటాకులతోనే కార్చిచ్చు రగిలించేశాడు. తెలంగాణా ఇవ్వకపోతే ఎక్కడ తగలబడిపోతామో అన్న భయాన్ని అన్ని పార్టీలకు కలిగించాడు. తెలంగాణా వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందరూ తాటాకు చప్పుల్లు చేసేవాళ్ళే. కెసీఆర్ లేడు. మోడీని తిట్టే ధైర్యం కానీ, మోడీపైన పోరాటానికి తెగించే స్థైర్యం కానీ ఒక్కళ్ళకు కూడా లేవు. అందుకే వీళ్ళు ముగ్గురూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. బాధ్యతను వేరే వాళ్ళ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ జనరంజక చిత్రాన్ని చూస్తూ మోడీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏమిచ్చినా……ఏమీ ఇవ్వకపోయినా 2019 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయ్యే ఎక్కువ మంది ఎంపిలు ఆయనకే సపోర్ట్ చేస్తారు అన్న వాస్తవం మోడీకి చాలా స్పష్టంగా తెలుసు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com