రెండు నెలలుగా బాక్సాఫీసు సందడి సందడిగా కనిపిస్తోంది. 2025 చివర్లో… కాస్త ఊపొచ్చింది. గత వారం ‘అఖండ 2’ హవా నడిచింది. ఈవారం కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. అయితే.. ‘అవతార్ 3` రూపంలో టాలీవుడ్ బాక్సాఫీసుకి ప్రమాదం పొంచి ఉంది. అవతార్ 3 వల్ల తెలుగు సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. `గుర్రం పాపి రెడ్డి` ఒక్కటే కాస్త ధైర్యం చేసి వదులుతున్నారు. అగస్త్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పాటలు, టీజర్, ట్రైలర్ బాగున్నాయి. క్రైమ్ కామెడీ సెటప్ లో ఓ కొత్త తరహా సినిమా చూడబోతున్నామన్న నమ్మకం కలిగించాయి.
`అవతార్ 3` ప్రభావం బాక్సాఫీస్ పై గట్టిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఈ సినిమా మంచి వసూళ్లు దక్కించుకోవొచ్చు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగుల జోరు ఎక్కువగానే కనిపిస్తోంది. `అవతార్’ ఇక్కడ చెప్పుకోదగిన స్థాయిలో వసూళ్లు అందుకొంది. అవతార్ 2 ఓకే అనిపించింది. ఏమాత్రం మంచి టాక్ వచ్చినా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం అభిమానుల ఎగబడడం ఖాయం. టాక్ బాగుంటే క్రిస్మస్ సినిమాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం వుంది. ‘అవతార్ 3’ ప్రభావం ఎలా ఉండబోతోందన్న విషయంపై నిర్మాతలు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు. అయితే బీ,సీ సెంటర్లలో `అఖండ 2`కి ఈవారం టికెట్లు తెగే అవకాశం ఉంది.