అత్యద్భుత దృశ్యాలతో కనువిందు చేసిన ‘బాహుబలి'(రివ్యూ)

‘అమర్ చిత్రకథ’ కామిక్ బుక్స్‌లో కొన్నేళ్ళక్రితం ‘బాహుబలి’ పేరుతో ఒక కథ వచ్చింది. దర్శకుడు రాజమౌళి ఆ కథ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కనబడుతోంది. మాహిష్మతి రాజ్యాన్నేలే రాజుకు బాహుబలి, భల్లాలదేవ అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. వారిద్దరూ రాజ్యాధికారంకోసం పోటీపడుతుంటారు. అన్ని పోటీలలో గెలిచినప్పటికీ బాహుబలి ఆధ్యాత్మికమార్గంలోకి మారిపోయి తమ్ముడికోసం మాహిష్మతి రాజ్యాన్ని త్యజిస్తాడు. భల్లాలదేవ కుట్రకు బలికాబోతున్న బాహుబలి కొడుకును శివగామి రక్షిస్తుంది. తల్లినుంచి విడిపోయిన అతను అడవిలోని గిరిజనులవద్ద శివుడు పేరుతో పెరుగుతాడు. మరోవైపు మాహిష్మతిని ఏలుతున్న దుర్మార్గుడు భల్లాలదేవనుంచి దేవసేనను రక్షించటంకోసం అవంతిక ప్రయత్నిస్తుంటుంది. ఆమెతో ప్రేమలో పడిన శివుడు దేవసేనను రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. దానికోసం మాహిష్మతికి వెళతాడు. అక్కడ శివుడు భల్లాలదేవను ఎలా సవాల్ చేస్తాడు, దేవసేనను ఎలా రక్షిస్తాడు, తన తండ్రి ఎవరనేది ఎలా తెలుసుకుంటాడనేది కథ.

అద్భుతమైన దృశ్యాలు చిత్రంలోని ప్రధానమైన ఆకర్షణ. మాహిష్మతి రాజ్యంలోని రాజప్రాసాదాలుగానీ, అడవులలోని జలపాతాలనుగానీ కన్నార్పకుండా చూస్తుండిపోతాము. సెంథిల్ తన కెమేరాతో వీటిని ఒడుపుగా పట్టుకుని ప్రేక్షకులకు చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని యుద్ధ సన్నివేశాలను అతను చిత్రీకరించినతీరు అమోఘం. 35 నిమిషాలపాటు సాగే ఆ సీన్లు రాజమౌళి ప్రతిభకు అద్దంపడతాయి. కాలకేయులకు, బాహుబలి, భల్లాలదేవ, కాటప్పలకు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు రామాయణ, మహాభారత చిత్రాలను తలపిస్తాయి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఈ తరంపిల్లలను ఈ చిత్రం అంతకంటే మరిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

చిత్రంలోని మైనస్ పాయింట్లు చెప్పాలంటే, ప్రభాస్-తమన్నా మధ్య ప్రణయం సరిగా పండలేదు. ద్వితీయార్థంలోని ఐటమ్ సాంగ్ కథాగమనానికి అడ్డుపడింది. కామెడి లేకపోవటం మరో మైనస్ పాయింట్. ప్రభాస్ బాహుబలిగానూ, శివుడుగానూ రెండుపాత్రలలో రాణించాడు. తమన్నా అందంకంటే అభినయంతో ఎక్కువగా ఆకట్టుకోవటం ఆశ్చర్యకర విషయం. ధీవరా పాటలో ఆమె అందానికి ప్రేక్షకులు మైమరిచిపోతారు. రానాకు ఇంతకాలానికి ఒక మంచి ప్రాజెక్ట్ దొరికింది. అతని బాడీకి తగిన పాత్ర కుదిరింది. చక్కటి తెలుగు ఉచ్ఛారణ ఉన్న అతను బాలీవుడ్‌లో అడ్డమైన సినిమాలు చేసేకంటే తెలుగులో మంచి ప్రాజెక్టులు ఎంచుకుని చేయటం మంచిది. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. అక్కడక్కడా తప్పితే స్పెషల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ మరింత పదునుగా ఉంటే బాగుండేది. కీరవాణి సంగీతం బయటకంటే ధియేటర్లో బాగా అనిపించింది. ఇక ఆయన ఇచ్చిన రీరికార్డింగ్ అత్యద్భుతంగా ఉంది. ముగింపు అర్థంతరంగా ఉండటం అసంతృప్తి కలిగిస్తుంది. ఇవన్నీ ఉన్నాకూడా మొత్తంమీద చూస్తే బాహుబలి నిరాశపరచదు. జీవితకాలానికి ఒకసారి వచ్చే ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలుగు360.కామ్ రేటింగ్: 3.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com