సెటైర్ : బాహుబల గణపతి !

అది వెండికొండ. మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నారు. అప్పటికే చాలాసేపటి నుంచీ గణపతి తన తండ్రితో మాట్లాడాలని ఎదురుచూస్తున్నాడు. ఇక లాభంలేదనుకుని అక్కడే ఉన్న పెద్ద శివలింగాన్ని పైకిలేపాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే కళ్లుతెరిచాడు శివుడు. బాలగణపతి చేస్తున్న చేష్టలకు నవ్వుకుంటూ పలకరించాడు.

`పుత్రా ఏమిటీ పని ? నువ్వు చిన్నపిల్లాడివి, ఆ మహా లింగాన్ని ఎలా లేపగలవు?’

`లేపుతాను నాన్నగారు, తప్పకుండా లేపుతాను’

`అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావ్?’

`భూలోకం వెళ్ళివచ్చిన నా వాహనమైన ఎలుక ఇప్పుడే చెప్పింది నాన్నగారు, ఈసారి వినాయక చవితికి నా భక్తులు శివలింగాన్ని భుజానవేసుకున్న గణపతికి పూజలు చేస్తారట’

`అదేమిటీ, నువ్వేమిటీ, నా మహాలింగాన్ని భుజాలకు ఎత్తుకోవడమేమిటీ! రావణాబ్రహ్మ అంతటి మహాపరాక్రమవంతుడికే చేతకాలేదు, సరే, కాస్తంత వివరంగా చెప్పు పుత్రా ఏమిటిదంతా?’

మూషికుడు ఈ మధ్యనే భూలోకం వెళ్ళాడని చెప్పానుగా, అతను చెప్పిన సమాచారం ప్రకారం ఈసారి భూలోకవాసుల్లో ఎక్కువమంది `బాహుబలి’ వినాయక విగ్రహాలతోనే పూజలు చేస్తారట.

అంతలో పక్కనే ఉన్న మూషికుడు అందుకుంటూ..
`అవును మహాదేవా, భూలోకంలో బాహుబలి అనే మహత్తర సినిమా వచ్చింది. దీని ప్రభావం భూలోకవాసులపై బాగానే పడింది. ఈసారి వినాయకచవితికి బాహుబలి గణపతి రూపాలే ప్రత్యేకమని చెప్పుకుంటున్నారు’

మహాదేవునికి ఆసక్తి పెరిగింది…
`ఏమీ, బాహుబలి గణపతి రూపాలా…ఎలా ఉంటాయి అవి, వివరంగా చెప్పు మూషికా… ‘

మూషికానికి మహా హుషారువచ్చింది.
`మహాశివా, ప్రతిఏటా వినాయక విగ్రహాలు తయారుచేసే వారి దగ్గర నుంచి ఇదిగో బాహుబలి గణపతి రూపాల లిస్ట్ పట్టుకొచ్చాను. చదువుతాను వినండి…’

శివలింగ గణపతి :

బాహుబలి చిత్రంలో శివుడు అనే ఒక కుర్రాడు ఉంటాడు మహాదేవా, అతగాడు ఆమె తల్లికోసం అతిపెద్ద శివలింగాన్ని అమాంతంలేపేసి భూజానవేసుకుని వడివడిగా నడుచుకుంటూ పక్కనే ఉన్న జలపాతం క్రింద ఉంచి తమకు ప్రతిక్షణం అభిషేకం జరిగేలా చేస్తాడు. ఈ సన్నివేశం స్ఫూర్తితోనే శివలింగాన్ని మోస్తున్న బాహుబల గణపతి విగ్రహాలను తయారుచేస్తున్నారు.

భల్లాలదేవ గణపతి

సినిమాలో విలన్ భల్లాలదేవ. ఇతను కూడా మహాబలశాలి. అడవి దున్న దూసుకువస్తుంటే చేతులు అడ్డుపెట్టి దాని దూకుడు ఆపేస్తాడు. అలాగే మన గణపతిస్వామివారు కూడా రాక్షసుడు అడవిదున్నలా విరుచుకుపడుతుంటే దాన్ని ఎదిరించి నిలవరించినట్టు విగ్రహాలు తయారుచేస్తున్నారండి. అవే, భల్లాలదేవ గణపతి విగ్రహాలుగా చలామణి అవుతున్నాయి.

కాలకేయ వినాశక గణపతి

సినిమాలో కాలకేయ ఎంట్రీతో కథకు మంచి ట్విస్ట్ వస్తుంది. అతగాడు చూడటానికి క్రూరంగా ఉంటాడు. అడవి ఏనుగుపై కూర్చుకుని కాలయముడిగా యుద్ధం చేస్తుంటాడు. చాలామందికి ఈ కాలకేయుడు నచ్చాడు. ఇప్పుడు ఈ కాలకేయుడే మన బాలగణపతికి శత్రువు. అంతటి క్రూరుడ్ని మన వినాయకులవారు తన దంతంతో చంపేస్తాడన్నమాట. ఇదీ సీను. అందుకుతగ్గట్టుగా కాలకేయ వినాశక గణపతి పేరిట విగ్రహాలు తయారుచేస్తున్నారు.

కట్టప్ప మహాయోధ గణపతి

మహాయోధుడు కట్టప్ప రూపంలో కూడా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి దేవదేవా.. కత్తిపట్టుకుని మహాసంకల్పంతో పరిగెత్తే రూపంలో ఈ విగ్రహాలు తయారవుతున్నాయి. శివదేవుడి ముంగిట యోధుడిలా కూర్చున్న ప్రతిమలు కూడా తయారుచేస్తున్నారు దేవ.

శివగామి రక్షిత గణపతి

శివుడు అందుకున్నాడు… మరి, పార్వతీదేవిని ఈసారి విగ్రహతయారీదారులు మరిచారా మూషికా…
అబ్బే లేదండీ, శివగామి రక్షిత గణపతి అని మరో విగ్రహం తయారుచేస్తున్నారు మహాదేవా. సినిమాలో శివగామి అనే మమతలతల్లి ఉంటుంది, తాను నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా, చిన్నారి బాలుడిని మునిగిపోకుండా చేతులతో పైకెత్తి పట్టుకుంటుంది. ఆ సన్నివేశం ఆధారంగా శివగామి రక్షిత గణపతి విగ్రహాలు తయారవుతున్నాయండి. శివకామిని అంటేనే పార్వతిదేవి అని కదా అర్థం. ఆమె చేతులతో బాలగణపతిని నీటమునగకుండా పైకిలేపి పట్టుకున్నట్టు కూడా విగ్రహాలు తయారవుతున్నాయి.
శివుడు ఆనందించాడు. పక్కనున్న పార్వతి పక్కున నవ్వింది. బాలగణపతి మళ్ళీ శివలింగం ఎత్తే పనిలో పడ్డాడు. మరిన్ని విశేషాలు తెలుసుకోవడం కోసం మూషికుడు భూలోకంవైపు తుర్రుమన్నాడు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com