నందమూరి అభిమానులు ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. చాలాసార్లు ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఫ్యాన్స్ కూడా.. చాలా ఆశ పడేవారు. బాలయ్య వందో సినిమాగా ఆదిత్య 999నే చూస్తామనుకొన్నారు. కానీ ప్రతీసారీ వెనక్కి వెళ్లిపోయేది. మోక్షజ్ఞ ఎంట్రీ ఈ కథతోనే అన్నారంతా. క్రిష్ దర్శకుడనే ప్రచారం బయటకు వచ్చింది. కానీ ఎందుకో.. ఇంత వరకూ మళ్లీ అప్ డేట్ లేదు. క్రిష్ ఈమధ్య ఫామ్ కోల్పోయాడు. ‘ఘాటీ’ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. దాంతో ఈ సీక్వెల్ పై మళ్లీ అనుమానాలు వేశాయి. అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి ఆశలు కల్పించే ప్రయత్నం చేశారు.
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య 369 సీక్వెల్ కు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. తన తనయుడు మోక్షజ్ఞతో కలిసి ఈ సీక్వెల్ చేస్తున్నానని ఆదిత్య 999 మాక్స్ అనే పేరుతో ఈ సినిమా రూపుదిద్దుకొంటుందని మరోసారి ప్రకటించారు. అయితే దర్శకుడు ఎవరన్నది చెప్పలేదు.
మరోవైపు క్రిష్ కూడా ఈ సీక్వెల్ కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. స్క్రిప్టు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మోక్షు రెడీ అయ్యాడా, లేదా? అనేదే ప్రశ్న. ఆమధ్య వైజాగ్ లో శిక్షణ తీసుకొన్నాడు మోక్షజ్ఞ. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో కూడా కొంత మేర తర్పీదు తీసుకొన్నాడు. ఆ తరవాత మళ్లీ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ట్రైనింగ్ సెషన్స్ మొదలెట్టినట్టు టాక్. అవి పూర్తవ్వాలి.. బాలయ్య చేతిలో సినిమాలు అయిపోవాలి.. అప్పుడు ఈ సీక్వెల్ మొదలవుతుంది. 2026లో పట్టాలెక్కే ఛాన్సుంది.

