నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ముందు అనుకొన్న ప్లాన్ ప్రకారం 2027 సంక్రాంతికి ఈ సినిమా రావాలి. అయితే ఇప్పుడు కాస్త ముందస్తుగానే అంటే ఈయేడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్సయ్యారు. దసరా బరిలో దించడానికి ఈ సినిమాని వీలైనంత త్వరగా పట్టాలెక్కించి, ముగించే ప్రయత్నాల్లో ఉన్నారు.
మరోవైపు 2027 సంక్రాంతిని సైతం బాలయ్య టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
గోపీచంద్ మలినేని సినిమాతోనే సమాంతరంగా ఈ ప్రాజెక్ట్ ని మొదలెడతారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు హరీష్. అది అవ్వగానే బాలయ్య సినిమాపై వర్క్ మొదలెడతారు. ఇప్పటికే బాలయ్యకు తగిన కథని హరీష్ సిద్ధం చేశారని సమాచారం. నాగవంశీకి సైతం సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. ప్రతీ యేడాది ఆయన్నుంచి ఓ సినిమా వస్తోంది. 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాని రిలీజ్ చేసి, మంచి హిట్టు కొట్టారు. ఇప్పుడు. 2027 సంక్రాంతినీ టార్గెట్ చేశారు.
