‘అఖండ 2 కేవలం తెలుగు సినిమా కాదు’అన్నారు నందమూరి బాలకృష్ణ. వైజాగ్ లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. ”అఖండ మొదటి భాగం కరోనా పాండమిక్ లో విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రం. జనం థియేటర్ కి వస్తారా అనే పరిస్థితుల్లో ఆ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత దేశవ్యాప్తంగా సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు మళ్లీ అఖండ తాండవంతో మీ ముందుకు వస్తున్నాం. ‘అఖండ2 కేవలం తెలుగు సినిమా కాదు. దేశం అంతా చూడాల్సిన సినిమా ఇది. అందుకే ముందు ముంబైలో ప్రచారం మొదలుపెట్టాం. ఈరోజు వైజాగ్ లో ఈవెంట్ జరుగుతుంది. రేపు కర్ణాటక కి వెళ్తున్నాం. అక్కడినుంచి చెన్నై వెళ్తున్నాం. సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవితాన్ని గడపండి. అన్యాయం ముందు తల వంచవద్దు’అని మన సనాతన హైందవ ధర్మం చెబుతోంది. సనాతన హైందవ ధర్మం, దాని శక్తి, గౌరవం, పరాక్రమం ఏమిటో ఈ సినిమాలో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు బాలయ్య.
అఖండ 2 ప్రచారం విషయంలో నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నట్టు అర్థం అవుతోంది. ఇటీవలే ఆయన ముంబై వెళ్లారు. అక్కడ ఓ పాట విడుదల చేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో మరో పాటని రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. అది కూడా పబ్లిక్ ఈవెంటే. ఆ తరవాత ప్రీ రిలీజ్ ఎలాగూ ఉంది. ఈసారి ప్రింట్, వెబ్ మీడియాలకు కూడా బాలయ్య పర్సనల్ గా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్టు టాక్. పాన్ ఇండియా సినిమా కదా.. ఈమాత్రం హడావుడి తప్పదు మరి.