సీనియర్ హీరోలు ఇప్పుడు స్వింగ్ మీద ఉన్నారు. వరుస హిట్లు వాళ్లను ఖుషీ చేస్తున్నాయి. త్వరిత గతిన నిర్ణయాలు తీసుకొంటున్నారు. చక చక ప్రాజెక్టులు సెట్ చేసుకొంటున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తరవాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నయనతార కథానాయక. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.
మరోవైపు బాలయ్య మరో కథని ఓకే చేశారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ దర్శకుడు శ్రీనివాసరాజు (దండుపాళ్యం ఫేమ్) ఇటీవల బాలయ్యని కలిశారు. ఓ కథ వినిపించారు. ఆ కథ బాలయ్యకు కూడా బాగా నచ్చింది. అయితే బాలయ్య తన నిర్ణయం ఇంకా చెప్పలేదని టాక్. గోపీచంద్ మలినేనితో పాటుగా సమాంతరంగా ఓ సినిమా చేసే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారని, అందుకే కొత్త కథలు వింటున్నారని తెలుస్తోంది. శ్రీనివాస రాజు ఆలోచనలు, టేకింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆయనతో.. బాలయ్య చేస్తే తప్పకుండా ఆ ప్రాజెక్ట్ కి ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది. బాలయ్య వినాల్సిన కథలు ఇంకొన్ని ఉన్నాయని, అన్నీ విన్న తరవాత.. ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ పైప్ లైన్ లో ఉందనుకోవొచ్చు.