హిట్, హిట్ 2, హిట్ 3.. ఇవి మూడూ మంచి విజయాల్ని అందుకొన్నాయి. ‘హిట్ 3’ నాని చేయడం వల్ల దాని స్పాన్ పెరిగింది. హిట్ 4లో హీరో ఎవరన్నది చెప్పేశారు. హిట్ 4లో కార్తీ కనిపించబోతున్నాడు. హిట్ 5లో ఎవరు చేస్తారో హిట్ 4 క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అయితే ఈసారి బాలకృష్ణ ఈ ఫ్రాంచైజీని ముందుకు నడిపించబోతున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. బాలయ్యని ‘హిట్’ ఫ్రాంచైజీలోకి తీసుకురావాలని నాని భావిస్తున్నాడని, ఈ మేరకు బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. హిట్ లాంటి సీక్వెన్స్‌లో బాలయ్య కనిపిస్తే… ఆ స్థాయి మారడం గ్యారెంటీ. హిట్ 5లో బాలయ్యతో పాటు నాని, కార్తీ కూడా ఉంటారని, హిట్ 6లో కూడా ఓ బడా స్టార్ నటిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకీ హీరో రేంజ్ పెంచుకొంటూ వెళ్లాలన్నది దర్శకుడిగా శైలేష్ కొలను ప్లానింగ్. ‘హిట్ 7’లో ఏడుగురు హీరోలూ ఒకే సినిమాలో ఎంట్రీ ఇస్తారు. దాంతో ఫ్రాంచైజీ క్లోజ్ అవుతుంది. ఓ ఫ్రాంచైజీలో 7 సినిమాలు రావడం బహుశా ఇండియన్ స్క్రీన్ పై ఇదే తొలి సారి అవుతుంది. త్వరలోనే శైలేష్ కొలను ఆస్ట్రేలియా వెళ్లబోతున్నారు. అక్కడ హిట్ 4 కథ రెడీ చేసుకొని వస్తారు. హిట్ 4 కంటే ముందు వెంకటేష్ తో ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. వెంకీకి సంబంధించిన లైన్ శైలేష్ దగ్గర సిద్ధంగా ఉందని, ఈసారి వెంకీని ఎంటర్టైన్మెంట్ కథలో చూపించబోతున్నారని తెలుస్తోంది. వెంకీ – శైలేష్ కాంబోలో ‘సైంధవ్’ వచ్చింది. కానీ అది ఫ్లాప్ అయ్యింది. అందుకే ఈసారి హిట్ సినిమా తీసి బాకీ తీర్చుకొందామనుకొంటున్నాడు శైలేష్.