బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలోనూ అంత ఈజీగా ఏమీలేదు. చోటా నేతలు కూడా ఆయనను నిలదీస్తున్నారు. జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ను ఆయన పట్టించుకోకపోవడంతో ఆ గొడవలు వీధి పోరాటాలకు దారి తీస్తున్నాయి.
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలులో కీలక సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి జిల్లా జనసేన అధ్యక్షుడు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయిన షేక్ రియాజ్ కు ఆహ్వానం పంపలేదు. తమ నాయకుడిని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రియాజ్ అనుచరులు సమావేశం వద్ద ఆందోళనకు దిగారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు పాత కేడర్‌ను, కష్టపడిన నాయకులను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ, జిల్లా అధ్యక్షుడిని నామమాత్రం చేసేలా వ్యవహరిస్తున్నారన్నది వారి ప్రధాన అభ్యంతరం. వాస్తవానికి బాలినేని శ్రీనివాస రెడ్డికి అధిష్టానం రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలను అప్పగించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న పాత నాయకులను, ముఖ్యంగా షేక్ రియాజ్ వంటి వారిని కలుపుకుని పోవడంలో బాలినేని విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా అందరినీ సమన్వయం చేయాల్సిన బాలినేని, తన సొంత వర్గాన్నే ప్రోత్సహిస్తున్నారన్న భావన జనసేన కేడర్‌లో బలపడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి వర్గ పోరు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని రియాజ్ వంటి వారు అంటున్నారు. బాలినేని తన పంథా మార్చుకోకపోతే, రియాజ్ వర్గం ఈ విషయాన్ని నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. బాలినేని మాత్రం.. జనసేన అంటే తాను..తన అనుచరులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
