టీవీ యాంకర్ ఉండి..వైసీపీలో చేరి రాజకీయాలు చేస్తున్న శ్యామలను ఇటీవల వైసీపీ గడప తొక్కనీయడం లేదని ప్రచారం జరుగుతోంది . టీవీ తెరపై యాంకర్‌గా తన వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించిన శ్యామల, వైసీపీలోకి వెళ్ళాక ఫైర్ బ్రాండ్ అవుతారని అందరూ ఊహించారు. కానీ సీన్ కట్ చేస్తే.. గత పది నెలలుగా వైసీపీ ఆఫీసులో ఆమె గళం మూగబోయింది. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నా, మైక్ పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ మాత్రం రావడం లేదు. దీంతో పార్టీలో ఆమె చాప్టర్ క్లోజ్ అయిందని ప్రత్యర్థి వర్గం ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఆమె రియాక్టయ్యారు.
తనపై జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వడానికి శ్యామల ఎంచుకున్న వేదిక పార్టీ ఆఫీస్ కాదు, తన సొషల్ మీడియా ఖాతా! జగన్ రిపై, పార్టీపై తనకు ఎంతటి అచంచలమైన విధేయత ఉందో చాటుకుంటూ సుదీర్ఘమైన వీడియో పెట్టారు. తనను పార్టీ దూరం పెడుతోందన్న విషయాన్ని స్మార్ట్‌గా స్కిప్ చేస్తూ, కేవలం తనపై దుష్ప్రచారం చేసేవారిని మాత్రమే విమర్శించారు. పాపం, పార్టీ కోసం గళమెత్తాలని ఉన్నా, ఆ అవకాశాన్ని పార్టీ ఆఫీసులోని నాలుగు గోడల మధ్య కాకుండా, ఇంటర్నెట్ వాల్‌పై మాత్రమే చూపెట్టుకోవాల్సి రావడం చూస్తుంటే వైసీపీలో ఆమె పరిస్థితి నోరున్నా మాట్లాడలేని చందంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఎవరైనా తమ ఉనికిని ప్రెస్ కాన్ఫరెన్స్‌ల ద్వారా చాటుకుంటారు. కానీ శ్యామల మాత్రం సోషల్ మీడియా పోస్టులతోనే సరిపెట్టుకుంటున్నారు. తనను ప్రెస్ మీట్లకు రానివ్వడం లేదన్న పచ్చి నిజాన్ని దాచిపెట్టి, అంతా బాగుంది అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం చూసి సొంత పార్టీ కేడరే నవ్వుకుంటోంది. పది నెలలుగా ఒక్కసారి కూడా పార్టీ తరపున మాట్లాడే ఛాన్స్ దక్కకపోయినా, ఈ పోస్ట్ ద్వారా జగన్ దృష్టిలో పడితే మళ్లీ మైక్ దొరుకుతుందేమో అన్నది ఆమె ఆశగా కనిపిస్తోంది.
శ్యామల పని అయిపోయిందని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతుంటే, ఆమె మాత్రం నేను ఇక్కడే ఉన్నాను అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆమె రాజకీయ కెరీర్ ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ లో ఉందన్నది సుస్పష్టం.ఇంతకూ ఆమెను దూరం పెట్టడానికి అసలేం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
