బళ్లారికి ఒకప్పుడు అప్రకటిత రాజుగా వ్యవహరించారు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు ఆయన వణికిపోతున్నారు. తనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి గాలి జనార్ధనా రెడ్డిని పూచికపుల్లగా తీసి పడేయడమే కాదు.. వయసు గుర్తు చేసి మరీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గాలి ఇంటికి ఫ్లెక్సీలు కట్టిన ఎమ్మెల్యే అనుచరలు
బళ్లారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని జనవరి 3, 2026న ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడైన సతీష్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి నివాసం ప్రహరీ గోడకు ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. తమ నాయకుడి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టవద్దని గాలి అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా తీవ్ర స్థాయికి చేరి ఇరువర్గాల మధ్య రాళ్ల దాడులు , తోపులాటకు దారితీసింది.
కాల్పుల్లో ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతి
ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే గంగావతి నుంచి గాలి జనార్ధన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆయన కారు దిగగానే పరిస్థితి మరింత విషమించింది. కన్నడ మీడియా సమాచారం ప్రకారం, ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ఒక గన్‌మన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని గాలి జనార్ధన్ రెడ్డి వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి కి గాయాలేమీ కాలేదు కానీ కాంగ్రెస్ కార్యకర్త ఒకరు బుల్లెట్ తగిలి మరణించారు. సతీష్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.
తనను చంపడానికి ప్లాన్ చేశారన్నది గాలి
నారా భరత్ రెడ్డి తనను చంపడానికి పక్కా స్కెచ్ వేశారని, వాల్మీకి విగ్రహ ఏర్పాటును అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా భరత్ రెడ్డి స్పందిస్తూ, తమ కార్యకర్త రాజశేఖర్‌ను గాలి అనుచరులే హత్య చేశారని, బళ్లారిలో శాంతిని దెబ్బతీసేందుకు జనార్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గాలి జనార్ధన్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బళ్లారి సిటీ ఎమ్మెల్యేగా భరత్ రెడ్డి గెలిచినప్పటి నుండి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి ప్రభావం లేకుండా చేస్తున్నారు. మరోవైపు, గాలి జనార్ధన్ రెడ్డి తన పాత కోటను తిరిగి దక్కించుకోవాలని చూస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే తన వయసు 35 మాత్రమేనని గాలి జనార్దన్ రెడ్డికి 65ఏళ్లు ఉంటాయని భరత్ రెడ్డి తరచూ గుర్తు చేస్తూ.. హెచ్చరికలు జారీ చేయడం బళ్లారిలో హాట్ టాపిక్ గా మారింది.


