ప్రధాని మోడీ మాటకి బలూచిస్తాన్ వాసుల నుంచి అనూహ్య స్పందన

కాశ్మీర్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న డిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకొన్న నిర్ణయాల వలన ఆశించిన ఫలితం రావడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు. కానీ ఆ సమావేశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ వేదికలపై చర్చ జరపాలన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలకి ఆ రెండు ప్రాంతాల ప్రజల నుంచి ఊహించని ప్రతిస్పందన వస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గిల్గిత్ లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘పాక్ ఆర్మీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పాక్ సైనికులు దౌర్జన్యాన్ని సహించబోమని నినాదాలు చేశారు.

కాశ్మీర్ లో వేర్పాటువాదంతో భారత్ ఏవిధంగా ఇబ్బంది పడుతోందో, అదేవిధంగా బలూచిస్తాన్ వేర్పాటువాదంతో పాకిస్తాన్ కూడా చాలా కాలంగా ఇబ్బందిపడుతోంది. కాశ్మీర్ లో వేర్పాటువాదానికి పాకిస్తాన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తోంది కానీ భారత్ ఏనాడూ కూడా బలూచిస్తాన్ వేర్పాటువాదులకి మద్దతు పలుకలేదు. కానీ కాశ్మీర్ అల్లర్లని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కి బుద్ధి చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బలూచిస్తాన్ ప్రజలకి అనుకూలంగా మాట్లాడారు.

హమల్ హైదర్ అనే బలూచిస్తాన్ ఉద్యమకారుడు మీడియాతో మాట్లాడుతూ, “ఒక భారత ప్రధాని మా గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి. అందుకు భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఏవిధంగా బంగ్లాదేశ్ ఏర్పడేందుకు అక్కడి ప్రజలకి సహకరించారో, అదే విధంగా నరేంద్ర మోడీ స్వాతంత్ర్యం సంపాదించుకొనేందుకు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. మేము కూడా భారత్ లాగే లౌకికవాద దేశంగా ఆవిర్భావించాలనుకొంటున్నాము. మేము కూడా భారత్ లాగ స్వేచ్చా స్వాతంత్ర్యాలని, ప్రజాస్వామ్యాన్ని కోరుకొంటున్నాము.

కానీ మా పోరాటాలని పాక్ సైనికులు అణచివేస్తున్నారు. వందలాది మందిని బందీలుగా పట్టుకుపోతున్నారు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులని మా ప్రాంతంలోకి పంపించి ఇక్కడ కూడా తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. బలూచిస్తాన్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న సింధీ నేతలని హత్య చేయిస్తోంది. అనేక గ్రూపులని ప్రోత్సహిస్తూ మామధ్య విభేదాలు సృష్టించి మా ఉద్యమాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది.”

“అగ్రరాజ్యాలు పాకిస్తాన్ కి చాలా ఆర్ధిక సహాయం అందిస్తున్నప్పటికీ, అది దానిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందలేకపోయింది. అంతేకాదు ఇతర దేశాల మాదిరిగా ఎటువంటి నియమ నిబంధనలని పాటించకుండా ఉగ్రవాదంవైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది. భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ మా పోరాటానికి మద్దతు ఇస్తే తప్ప మేము స్వేచ్చాయుత జీవితం గడుపలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక భారత్ మద్దతు మాకు చాలా అవసరం,” అని అన్నారు.

బలూచిస్తాన్ కే చెందిన మరొక ఉద్యమకారిణి నెయిలా ఖాద్రి మాట్లాడుతూ “బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలని చిరకాలంగా పాక్ అణగద్రొక్కే ప్రయత్నం చేస్తోంది. భారత్ మాకు మద్దతు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. సెప్టెంబరులో జరుగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశాలలో మా సమస్యల గురించి భారత్ ప్రస్తావించాలని కోరుతున్నాము,” అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ చేసిన చిన్న వ్యాఖ్యకి ఆ రెండు ప్రాంతాల నుంచి ఇంత స్పందన రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, ఇది పాక్ కి కనువిప్పు కలిగి ఇకనైనా అది కాశ్మీర్ కి దూరంగా ఉంటే మంచిది. కానీ అది అసంభవం కనుక భారత్ కూడా పాక్ కి దాని బాషలోనే బుద్ధి చెప్పాలంటే ఆ రెండు ప్రాంతాలలో జరుగుతున్న మనవ హక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడం మంచిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com